: అప్పుపై తత్కాల్ టికెట్... భారీ ఆఫర్ ఇచ్చిన ఐఆర్సీటీసీ

అత్యవసరంగా ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించాలంటే, చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఎక్కిరిస్తుంటాయి. కనీసం తత్కాల్ లోనైనా సీటు దొరుకుతుందా అంటే గ్యారెంటీ ఉండదు. ఒకవేళ టికెట్ ఉన్నా, డబ్బు చెల్లించే వెసులుబాటు ఉండకపోవచ్చు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) భారీ ఆఫర్ ను ప్రకటించింది. టికెట్ ను ఆన్ లైన్ లో తక్షణం బుక్ చేసుకుని డబ్బును ఆ తరువాత చెల్లించే వెసులుబాటును దగ్గర చేసింది. ఆ డబ్బులు ఇంటి వద్దకు వచ్చే తమ ప్రతినిధికి చెల్లింవచ్చని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్లో ఇప్పటివరకూ సాధారణ రిజర్వేషన్లకు ఈ సదుపాయం ఉండగా, ఇకపై తత్కాల్ కింద బుక్ చేసుకున్న టికెట్లకు కూడా వర్తించేలా నిబంధనలు మార్చినట్టు పేర్కొంది.

ఈ సదుపాయం కావాలంటే 'ఐఆర్సీటీసీ డాట్ పే ఆన్ డెలివరీ డాట్ కో డాట్ ఇన్'లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ వివరాలు ఇవ్వాలి. టికెట్ బుకింగ్ వేళ, పే ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై టికెట్ ను కేటాయించే ఐఆర్సీటీసీ, 24 గంటలలోపు పేమెంట్ కోసం ఉద్యోగిని పంపుతుంది. అతను వచ్చే లోపు డెలివరీ క్యాన్సిల్ చేసుకుంటే, భారీ జరిమానాతో పాటు, ఐఆర్సీటీసీ ఖాతా పర్మినెంట్ గా తొలగిపోతుంది. ఇక ఇంటివద్ద డెబిట్, లేదా క్రెడిట్ కార్డుతో కూడా టికెట్లకు డబ్బులు కట్టవచ్చని వెల్లడించింది. కాగా, తత్కాల్ బుకింగ్ సమయాల్లో డబ్బు కట్ అయినా, టికెట్ రాకపోవడం, ఆ డబ్బు తిరిగి ఖాతాలో చేరడానికి రెండు వారాల వరకూ సమయం పడుతూ ఉండటంతో కొత్త విధానం వైఫల్యాలను తగ్గించేందుకు సహకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News