: తమిళనాట మలుపులు తిరుగుతున్న రాజకీయం... దినకరన్ సవాలు... పళని, పన్నీర్ వ్యూహాలు!

తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శశికళ వర్గాన్ని పార్టీ నుంచి సాగనంపేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులతో పార్టీపై పట్టు నిలుపుకునేందుకు పళనిస్వామి, పన్నీరు సెల్వం, దినకరన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పళనిస్వామి, పన్నీరు సెల్వం విలీనం ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి, ఎన్డీయేతో భాగస్వామ్యం పంచుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కేంద్రంలో మంత్రిపదవులిచ్చేందుకు కూడా ఎన్డీయే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ స్పందించారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళతో సమావేశమైన అనంతరం మాట్లాడుతూ, ఈ వారంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తానని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. తనకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. పార్టీ యథాతథంగా కొనసాగుతుందని అన్నారు. పళని, పన్నీరు విలీనంపై మాట్లాడుతూ, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం నిర్వహించిన పళనిస్వామి దీనిపై చర్చించారు. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని, ఎవరి గురించి ఆందోళన చెందడం లేదని తెలిపారు. 

More Telugu News