: మహిళా నేతలకు అశ్లీల మెస్సేజ్ లు పంపుతున్న ఇమ్రాన్ ఖాన్: అయేషా

తెహ్రీక్ ఇ ఇన్ఫాస్ పార్టీ అధినేత, పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మరో సమస్యలో చిక్కుకున్నారు. పార్టీలో ఉన్న మహిళా నేతలను ఇమ్రాన్ వేధిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు ఆయేషా గులాలై తీవ్ర ఆరోపణలు చేశారు. దక్షిణ వజీరిస్థాన్ కు చెందిన ఆమె మాట్లాడుతూ, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. తన ఆత్మాభిమానమే తనకు ముఖ్యమని, తన గౌరవాన్ని పణంగా పెట్టి పార్టీలో కొనసాగలేనని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. పార్టీలోని మహిళా నేతలకు అశ్లీల మెస్సేజ్ లను ఇమ్రాన్ ఖాన్ పంపుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఎవరూ సహించరని తెలిపిన ఆమె... మెసేజ్ లను బయట పెట్టేందుకు మాత్రం నిరాకరించారు.

ఇమ్రాన్ ఖాన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని... ఎవరైనా ఆయన కంటే మెరుగ్గా ఉండటాన్ని సహించలేకపోతున్నారని ఆయేషా అన్నారు. ఇదే సమయంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆమె ప్రశంసించారు. మహిళలకు షరీఫ్ ఎంతో గౌరవం ఇస్తారని కితాబిచ్చారు. అయితే, తాను నవాజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్ఎన్ పార్టీలో చేరడం లేదని చెప్పారు. మరోవైపు ఆయేషాపై తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ప్రతినిధి మండిపడ్డారు. డబ్బుకోసం ఆమె నవాజ్ షరీఫ్ పార్టీకి అమ్ముడుబోయిందని ఆరోపించారు.

More Telugu News