: జియో ఉచితాలకు ముగింపు పలికే సమయమొచ్చింది!

ఇండియా టెలికం రంగంలో రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో మొదలైన ధరల యుద్ధం ముగింపు దశకు చేరుకుందని రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. జియో తానందిస్తున్న ఉచితాలకు ముగింపు పలికే సమయం దగ్గరైందని, మరో ఏడాదిన్నరలో పోటీని విరమించి, ధరలను హేతుబద్ధం చేస్తుందని అంచనా వేసింది. చెప్పకోతగిన కస్టమర్లు జియో గొడుగు కిందకు చేరిన నేపథ్యంలో, మార్జిన్లు పెంచుకోవడం, ఆదాయంపై ఆ సంస్థ దృష్టిని సారించనుందని ఎస్ అండ్ పీ క్రెడిట్ అనలిస్టు అశుతోశ్ శర్మ వెల్లడించారు.

భారీ డిస్కౌంట్ విధానం జీవితకాలం కొనసాగే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డ ఆయన, ఇప్పటికే 10 శాతం సెల్ ఫోన్ వినియోగదారులకు జియో చేరువైందని గుర్తు చేశారు. ఇందుకోసం ఆ సంస్థ ఏడాది కన్నా తక్కువ సమయాన్నే తీసుకుందని, భారీ డిస్కౌంట్లు, ఉచిత ఆఫర్లే ఇందుకు కారణమని ఆయన అన్నారు. జియో తెరతీసిన ఈ టెలికం టారిఫ్ వార్ కారణంగా ఇతర కంపెనీలు లాభాలను కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అశుతోశ్ వెల్లడించారు. కాగా, గత సంవత్సరం నవంబరులో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో, వాయిస్ కాల్స్ ను జీవితాంతం ఉచితంగా అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఇతర కంపెనీలతో పోలిస్తే, తక్కువ ధరకు 4జీ డేటాను అదిస్తుండటంతో ఎంతో మంది రిలయన్స్ జియో కనెక్షన్లు తీసుకున్నారు.

More Telugu News