: బీసీసీఐ ఆ భయంతోనే ఒలింపిక్స్ కు అంగీకరించడం లేదా?

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. గతంలో దీనికి అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే బీచ్ క్రికెట్ అనే సరికొత్త క్రికెట్ ను ఆస్ట్రేలియన్లు గతంలో పరిచయం చేశారు. అయితే దానికి సరైన ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్ పరిచయమైంది. ఇది క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న ప్రయత్నాలను ఐసీసీ మరోసారి ప్రారంభించింది. అయితే, ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చేందుకు ఈ ఆటను ఆడే మెజారిటీ దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి ఇతర దేశాల క్రికెట్ బోర్డులన్నీ సిద్ధంగానే ఉన్నాయని తెలుస్తోంది. అయితే క్రికెట్ లో అత్యంత బలమైన బోర్డుగా ఉన్న బీసీసీఐ మాత్రం అంగీకరించేలా కనిపించడం లేదు.

ఇప్పటికే సుప్రీంకోర్టు నిబంధనలతో బీసీసీఐలో ఇతర రంగాల ప్రముఖుల ప్రమేయం తగ్గిపోయింది. అలాగే ప్రతి పైసాకు లెక్కలు చూపించాల్సి వస్తోంది. గతంలో రాష్ట్ర బోర్డులకు ఇష్టం వచ్చినట్టు నిధులను బీసీసీఐ పెద్దలు కేటాయించేవారు. ఇప్పుడలా కాదు, కేటాయించిన ప్రతి పైసాతో పాటు, వినియోగించిన ప్రతి పైసాకు లెక్క తప్పడం లేదు. అలాంటి సమయంలో క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేరిస్తే... దాని పాలన ప్రక్రియలో జాతీయ ఒలింపిక్ సంఘం వేలు పెడుతుంది. అలా జరిగితే బోర్డుపై గుత్తాధిపత్యం క్రికెటేతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. తరువాత అందులోకి రాజకీయ నాయకులు లేదా అధికారులు చేరే అవకాశం ఉంటుంది. దీంతో కామధేనువులాంటి బోర్డును చేజేతులా ప్రభుత్వపరం చేయాల్సి వస్తుంది. దీంతో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చకపోయినా, దాని ప్రత్యేకత దానికి ఉందని బీసీసీఐ వాదిస్తోందని తెలుస్తోంది. 

More Telugu News