: తిరుమలలో ఉదయం నుంచి కుండపోత వర్షం.. భక్తుల ఇక్కట్లు!

దేవదేవుడు కొలువైన తిరుమల గిరుల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకూ కుండపోత వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడున్నర గంటల వ్యవధిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దర్శనానికి వెళ్లే భక్తులు తడిసి ముద్దవగా, ఆలయంలోకి చేరిన నీటిని హై స్పీడ్ మోటార్లతో ఎప్పటికప్పుడు బయటకు తోడించారు. దర్శనం ముగించుకుని వచ్చిన భక్తులు, ఎటూ వెళ్లేందుకు వీలు లేక నాదనీరాజనం మండపంలో నిలిచిపోయారు. పైకప్పులు లేని దుకాణాలన్నీ మూతపడగా, గత నాలుగైదు రోజులుగా ఎండ తీవ్రతకు అల్లాడుతున్న తిరుమల, వర్షంతో కాస్తంత చల్లబడింది.

ఇదిలావుండగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నెల రోజులూ పుష్కరిణి మరమ్మతు పనులు జరుగుతాయని, భక్తుల స్నానాలకు వరాహస్వామి ఆలయం వెనుక భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

కాగా, తిరుమల రెండో కనుమ దారిలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు ఒకటి చెట్టును ఢీకొన్న ఘటనలో 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు, గాయపడిన వారిని హుటాహుటిన రూయా ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోగా, బస్సును పక్కకు తీయించేందుకు అధికారులు కాసేపు కష్టపడాల్సి వచ్చింది.

More Telugu News