: ఎటూ తేల్చని సిట్... సినీ ప్రముఖులు సాక్షులు మాత్రమే, అంతా తప్పించుకున్నట్టే!

గడచిన నెల రోజులుగా టాలీవుడ్ ను ఊపేసిన డ్రగ్స్ దందా వ్యవహారంలో సిట్ విచారణ ముగింపు దశకు చేరుకుంది. గడచిన రెండు వారాలుగా సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు నేటితో ఆ తతంగాన్ని ముగించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్, జిశాన్, మైక్ కమింగాలు సహా మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన అధికారులు త్వరలో వారిపై చార్జ్ షీట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకూ 11 మంది సినీ ప్రముఖులను దాదాపు 88 గంటల పాటు విచారించిన సిట్, అరెస్టయిన నిందితులకు డ్రగ్స్ దందాపై పై స్థాయిలో ఉన్న లింకులను ఛేదించలేకపోయిందని తెలుస్తోంది.

అసలు మనమేం విచారించామన్న క్లారిటీ కనీసం ఎక్సైజ్ అధికారుల్లో కూడా లేదని ఆ శాఖ ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇక విచారణను ఎదుర్కొన్న వారిలో ఇద్దరు సినీ ప్రముఖుల అరెస్ట్ తప్పదంటూ వార్తలు వచ్చినప్పటికీ, వారు కూడా తప్పించుకున్నట్టేనని సమాచారం. వీరందరినీ సాక్షులుగా పేర్కొనే అవకాశాలు ఉన్నట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి.

నేడు చివరిగా గాయని గీతామాధురి భర్త నందు విచారణకు రానుండగా, ఈ 12 మందిలో ఒక్కరిని కూడా నిందితులుగా చూపేందుకు పూర్తి ఆధారాలు లేవని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 29 మందిని సాక్షులుగా చేర్చాలని భావిస్తున్నామని, తమకు అప్పగించిన పని ముగిసినట్టేనని ఓ సిట్ అధికారి తెలిపారు. ఇక ఈ కేసులో రెండో జాబితా ఉంటుందని తాను చెప్పలేదని, చార్జ్ షీట్ దాఖలుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పడంతో ఈ కథ ఇక కంచికి చేరినట్టే అనిపిస్తోంది.

More Telugu News