: అవును, అప్పులున్నాయి.. పోలీసులకు చెప్పిన విక్రమ్ గౌడ్.. ఆత్మహత్యాయత్నమే అంటున్న పోలీసులు!

ముఖేశ్‌గౌడ్‌పై కాల్పుల వ్యవహారం క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. కాల్పుల విషయంలో విక్రమ్ గౌడ్, ఆయన భార్య షిపాలి.. ఇద్దరూ కట్టుకథ చెప్పినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సీసీ టీవీ పుటేజీని వీడియో అనాలసిస్ సెంటర్‌కు పంపారు. అయితే కాల్పులకు ఉపయోగించిన ఆయుధం విషయంలో మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దాని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు విక్రమ్ ఇంటిలోకి ఆగంతకుడు వచ్చి కాల్పులు జరిపిన ఆనవాళ్లు ఏవీ లేవని నిర్ధారించిన పోలీసులు, సీన్‌ను రీ కనస్ట్రక్షన్ చేసి అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు శాస్త్రీయ ఆధారాల ద్వారా ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
 
సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు విక్రమ్ చెబుతున్నట్టు ఇంట్లోకి బయట వ్యక్తులు ఎవరూ రాలేదని ఓ అంచనాకు వచ్చారు. అయితే ఓ కెమెరాలో మాత్రం నల్లరంగు కారు వెళ్లినట్టు కనబడింది. అందులో స్పష్టత లేకపోవడంతో వీడియో అనాలసిస్ సెంటర్‌కు పంపారు. విక్రమ్ ఆత్మహత్యకు ప్రణాళిక వేశాడని, అయితే ఇందులో బయట వ్యక్తుల పాత్ర కూడా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, తనకు పెద్దమొత్తంలో అప్పులు ఉన్న మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అయితే ఒడిశాలో చేస్తున్న మైనింగ్ వ్యాపారంలో తనకు చాలా డబ్బులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. విక్రమ్ కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ రిపోర్టు నేడు (సోమవారం)వచ్చే అవకాశం ఉంది.

More Telugu News