: ఇండియాలో తగ్గుతున్న బంగారం కొనుగోళ్లు: థామ్సన్ రాయిటర్స్

ఇండియాలో బంగారం కొనుగోళ్లు తగ్గుతున్నాయని, దీని ప్రభావంతో 2017 రెండో అర్థభాగంలో దిగుమతులు గణనీయంగా తగ్గిపోనున్నాయని రీసెర్చ్ సంస్థ థామ్సన్ రాయిటర్స్ అంచనా వేస్తోంది. తొలి ఆరు నెలల కాలంలో 500 టన్నులకు పైగా బంగారం దిగుమతి కాగా, జూలై - డిసెంబర్ మధ్య కాలంలో కేవలం 250 టన్నుల వరకూ మాత్రమే దిగుమతి కావచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. జనవరి నుంచి బంగారం కొనుగోళ్లు పెరగడానికి నోట్ల రద్దు కూడా ఓ కారణమని అంచనా వేసిన థామ్సన్ రాయిటర్స్, ఇక ఇప్పుడు అమ్మకాలు తగ్గాయని, గత సంవత్సరం జూలై - డిసెంబర్ తో పోలిస్తే 50 శాతం తక్కువగా బంగారం దిగుమతి ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది.

అయినప్పటికీ, మొత్తం దిగుమతి అయ్యే బంగారం 2016తో పోలిస్తే 50 శాతం వరకూ ఎక్కువగా ఉంటుందని, సుమారు 760 టన్నుల వరకూ దిగుమతి కావచ్చని పేర్కొంది. ఈ సంవత్సరం ఆభరణాలను కొనుగోలు చేయాలని భావించిన వారు ముందుగానే కొనుగోళ్లు జరిపేశారని అంచనా వేస్తున్నామని, ఇక ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో ఇప్పటికిప్పుడు అమ్మకాలు పెరగకపోవచ్చని థామ్సన్ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. జీఎస్టీ అమలు తరువాత, ఆభరణాలపై 5 శాతం పన్నులు, బులియన్ మార్కెట్ పై మూడు శాతం పన్ను కూడా ప్రజలను నూతన కొనుగోళ్లకు దూరం చేయనుందని అంచనా వేసింది.

More Telugu News