: పాక్ ను కూడా శ్రీలంక మాదిరి ఆక్రమించనున్న చైనా... అంతర్జాతీయ పరిశీలకుల అంచనా!

పాత తెలుగు సినిమాల్లో గ్రామ పెద్దల్లో ఒకరైన నాగభూషణం తొలుత కొంత మొత్తాన్ని అప్పుగా ఇస్తాడు. ఆ తరువాత అవసరం అంటే మరికొంచెం ఇస్తాడు. మళ్లీ అప్పంటే ఏదో ఒకటి రాయించుకుని ఇస్తాడు. తరువాత చివర్లో దొంగలెక్కలు వేసి చూపించి, ఆస్తిమొత్తం నొక్కేసి ఇంటినుంచి గెంటేస్తాడు. ఇలాంటి పరిస్థితి పాకిస్థాన్ కు రానుందని అంతర్జాతీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోని పేద దేశాలకు రుణాల పేరుతో వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇస్తున్న చైనాది ఇదే తీరు అని వారు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ లో గ్వదర్ నుంచి చైనాలోని కష్గర్ వరకు నిర్మించిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు ద్వారా పాక్ కు ఉన్న ప్రయోజనాల కంటే చైనాకు జరిగే మేలే ఎక్కువని వారు చెబుతున్నారు.

కొన్నేళ్ల కింద శ్రీలంకకు చైనా భారీగా ఆర్థికసాయం అందించేందుకు ముందుకువచ్చింది. మౌలిక నిర్మాణాలకు రుణాలను ఇస్తామన్న చైనా ఆఫర్ కు శ్రీలంక అప్పటి అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన హంబన్‌ టొట సముద్రతీరంలో భారీ నౌకాశ్రయం నిర్మిస్తామని చైనా తెలిపింది. చెప్పినట్టే చైనా నైకా నిర్మాణం పూర్తిచేసింది. అయితే చైనా ఊహించిన స్థాయిలో ఆదాయం రాలేదు. దీంతో ఆ నౌకాశ్రయంలోని ఆదాయంతో పాటు, వేలాది ఎకరాల భూములను చైనా 99 ఏళ్ల పాలనకు ఒప్పందం చేసుకుంది. చైనా కుయుక్తులను గుర్తించిన స్థానికులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ చైనా పట్టుతో ఒప్పందం జరగడం విశేషం.

ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా అసలు రంగును అంతర్జాతీయ పరిశీలకులు గుర్తించి హెచ్చరిస్తున్నారు. వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ పేరిట పాక్‌ లోని గ్వదర్‌ నుంచి చైనాలోని కష్గర్‌ వరకు నిర్మిస్తున్న చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ రహదారితో పాక్ రూపురేఖలు మారిపోతాయని చెప్పడంలో వాస్తవం చాలా తక్కువని వారు చెబుతున్నారు. పూర్తిగా స్వంత ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ ప్రాజెక్టు కోసం పాక్ కు చైనా 65 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. తొలుత మాటలకు, ఇప్పుడు వాస్తవ పరిస్థితికి మధ్య తీవ్రమైన వ్యత్యాసాన్ని వారు చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఏకంగా వేలమంది సైనికులను చైనా మోహరించింది.

చైనా నుంచి వచ్చి పడుతున్న నకిలీలతో స్థానిక వ్యాపారులు, తయారీ దారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. తమ వస్తువుల కంటే చైనా వస్తువులే మార్కెట్ ను ఆక్రమిస్తుండడంతో వాణిజ్య రంగం ఆందోళన చెందుతోంది. అంతే కాకుండా చైనా స్వల్ప వడ్డీ రేట్లు అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, వరల్డ్ బ్యాంక్ కంటే కూడా దాని వడ్డీ చాలా ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. డ్రాగన్ కంట్రీ తొలుత అప్పులిచ్చి, తరువాత మింగేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకకు పట్టిన గతే పాక్ కు పడుతుందని వారు సూచిస్తున్నారు. అయినా భారత్ తో కయ్యానికి కాలుదువ్వాలంటే చైనాలాంటి దేశం అండ అవసరమని భావిస్తున్న పాక్ మాత్రం వీటిని పట్టించుకోకపోవడం విశేషం.

More Telugu News