: జెఫ్ బెజోస్ ది ఒక రోజు ముచ్చటే... తిరిగి అత్యంత ధనవంతుడిగా బిల్ గేట్స్!

నిన్న ఈక్విటీ మార్కెట్ ర్యాలీతో అమేజాన్ వాటా విలువ భారీగా పెరగగా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ ను కిందకు నెట్టేసిన జెఫ్ బెజోస్, 24 గంటలు తిరగక ముందే తన సంపదలో కొంత మొత్తాన్ని నష్టపోయి, తిరిగి రెండో స్థానానికి దిగజారారు. వ్యక్తుల ఆదాయాలను రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అనుక్షణమూ పరిశీలిస్తుండే 'ఫోర్బ్స్' మేగజైన్, నిన్న ఓ ప్రకటన విడుదల చేస్తూ, బిల్ గేట్స్ సంపద 90 బిలియన్ డాలర్లను దాటిన జెఫ్ బెజోస్ 90. బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత ధనవంతుడైనాడని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక తాజా మార్కెట్ సెషన్ లో ఇన్వెస్టర్లు అమెజాన్ వాటాలను విక్రయించి లాభాలను స్వీకరించడంతో ఈక్విటీ విలువ పడిపోయింది. ఫలితంగా జెఫ్ ఆస్తుల మొత్తం కూడా తగ్గింది. అమెజాన్ లో 17 శాతం వాటాలను కలిగున్న జెఫ్, సమీప భవిష్యత్తులోనే బిల్ గేట్స్ ను మరోసారి అధిగమించడం ఖాయమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. విస్తరణ ప్రణాళికలను వేగంగా అమలు చేస్తుండటం, యూఎస్ గ్రోసరీస్ సంస్థ 'హోల్ ఫుడ్స్'ను విలీనం చేసుకోవడం అమేజాన్ విలువను పెంచింది. గత నాలుగు నెలల్లో సంస్థ ఈక్విటీ విలువ 24 శాతం పెరుగగా, 53 ఏళ్ల జెఫ్ ఆస్తుల మొత్తం 17 బిలియన్ డాలర్లు పెరిగింది.

More Telugu News