: కాల్పులపై నోరు మెదపని విక్రమ్ గౌడ్.. తూటా కుడి చేతి నుంచి ఎడమ చేతివైపు దూసుకెళ్లడంతో అనుమానాలు!

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై  కాల్పుల వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై విక్రమ్ నోరు విప్పకపోవడంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విక్రమ్‌కు తగిలిన బులెట్ కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపు దూసుకెళ్లడంపై అనుమానాలు ఉన్నట్టు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. కాల్పులు జరిపిన సమయంలో ఇంటిలోకి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్టు పేర్కొన్నారు. విక్రమ్ నోరు విప్పితేనే అన్ని విషయాలు బటయకు వస్తాయన్నారు. కాల్పలు గురించి ప్రశ్నించినా ఆయన నోరు విప్పడం లేదని తెలిపారు. ఆయనకు ఆయుధాల లైసెన్స్ లేదని పేర్కొన్నారు. విక్రమ్ పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఎటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని డీసీీపీ తెలిపారు.

కాగా, బంజారాహిల్స్‌లోని రోడ్ నంబరు 86లో విక్రమ్ గౌడ్ ఇంట్లో ఈ తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. బ్రహ్మముహూర్తం కావడంతో పూజ కోసం లేచి సిద్ధమై హాల్లో కూర్చున్న విక్రమ్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ సమయంలో విక్రమ్ భార్య ఇంట్లోనే ఉన్నారు. సెక్యూరిటీ గార్డు అవుట్ హౌస్‌లో ఉన్నాడు. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చిన భార్యకు రక్తపు మడుగులో పడి ఉన్న విక్రమ్ కనిపించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న విక్రమ్‌కు ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.

More Telugu News