: ఏమైనా కెలికితే, గుండెలపై పొడుస్తాం: అమెరికాకు ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరిక

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను పదవి నుంచి తొలగించాలన్న ఉద్దేశంతో, అమెరికా ఏవైనా చర్యలకు పాల్పడితే, అమెరికాపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగుతామని, అమెరికాకు గుండె వంటి నగరాలే తమ లక్ష్యమని నార్త్ కొరియా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ సుప్రీమోను తొలగించే యత్నాలు చేస్తే, అమెరికా గుండెలపై అణుబాంబుతో పొడుస్తామని ప్రభుత్వ రంగ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీకి ఆయన చెప్పారు. కిమ్ ను తొలగించాలని కొన్ని దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన ఆయన, దాన్ని అడ్డుకునేందుకు అణ్వాయుధాలు సహా వేటినైనా వినియోగించేందుకు వెనుకాడేది లేదని అన్నారు.

"మా అధినేతకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేందుకు అమెరికా ఏ చిన్న సాహసాన్ని చేసినా, ఎంత మాత్రం జాలి లేకుండా శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తాం" అని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారని కేసీఎన్ఏ పేర్కొంది. ఉత్తర కొరియాను కిమ్ నుంచి వేరు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వ్యాఖ్యానించినట్టు మంగళవారం నాడు 'సీఎన్ఎన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, దానికి ప్రతిగానే నార్త్ కొరియా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News