: ఈ ఆరుగురు మహిళా వరల్డ్ కప్ మనదే!

భారత మహిళా క్రికెట్ జట్టు ముందు అద్భుతమైన అవకాశం నిల్చుంది. భారత్ లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో టీమిండియాకు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ జట్టుకు లేదు. కేవలం ఆదరణ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్, కాంట్రాక్ట్, ఇతర సౌకర్యాల కల్పన వంటి అన్ని విషయాల్లో మహిళా క్రికెట్ జట్టు వివక్ష ఎదుర్కొంటోంది. దీనిపై బీసీసీఐని ప్రశ్నించలేని పరిస్థితి మహిళా క్రికెట్ జట్టుది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టును మహిళా క్రికెట్ జట్టు మట్టి కరిపించింది. హర్మన్ ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్ తో ఫైనల్ లో కాలు పెట్టింది.

ఫైనల్ లో రేపు ఇంగ్లండ్ జట్టును ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో బలమైన ఇంగ్లండ్ పై విజయం సాధించాలంటే టీమిండియాలోని ఆరుగురు ఆటగత్తెలు అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ లో కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అర్ధసెంచరీ వరకు రాణించే మిథాలీ దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమవుతోంది. మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసి, సమకాలీన మహిళా క్రికెటర్లకు అందనంత ఎత్తులో నిలిచిన మిథాలీ... ఫైనల్ లో భారీ స్కోరు సాధించాలి. ఫస్ట్ డౌన్ లో వచ్చే మిథాలీ రాణిస్తే జట్టుకు నిలకడతోపాటు మిగిలిన ఆటగత్తెలు ధైర్యంగా బ్యాటు ఝుళిపించే అవకాశం ఉంటుంది. ఓపెనర్ స్మృతి మందాన ఫైనల్ లో రాణించాల్సిన అవసరం ఉంది. సెంచరీతో జట్టులో ఆశలు రేపిన స్మృతి సహజశైలిలో చెలరేగితే ఇంగ్లండ్ చేష్టలుడగాల్సిందే.

ఇక భారత మహిళా జట్టు తురుపుముక్క హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి తన సత్తా చూపించాలి. ఈ ముగ్గురు బ్యాటింగ్ భారాన్ని తలకెత్తుకుంటే జట్టుకు అవసరమైనన్ని పరుగులు సులభంగా వచ్చి చేరుతాయి. అయితే ఇంగ్లండ్ కి కూడా ఈ ముగ్గురే లక్ష్యం కావడం విశేషం. ఈ ముగ్గుర్నీ వేగంగా పెవిలియన్ పంపి విజయం సాధించాలని ప్రణాళికలు కూడా రచించారు. ఇక బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జులన్ గోస్వామితో పాటు శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే టీమిండియాదే విజయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆరుగురి ప్రదర్శనపైనే టైటిల్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. 

More Telugu News