: 'భారతీయులు అడుక్కునేవారు' అన్న ఒప్పో సంస్థ... తీవ్ర విమర్శలతో సర్దుకోలేక అవస్థలు!

చైనా కేంద్రంగా నడుస్తూ, ఇండియాలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న 'ఒప్పో' సంస్థలోని ఓ ఉన్నతోద్యోగి భారతీయులను అవమానించారని వచ్చిన వార్తలతో సెల్ ఫోన్ల అమ్మకాలు ఒక్కసారిగా తగ్గిపోయి, తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, పరిస్థితిని చక్కదిద్దడానికి కంపెనీ యాజమాన్యం నానా పాట్లూ పడుతోంది. సంస్థలోని పంజాబ్ కార్యాలయంలో పని చేస్తున్న చైనా ఉద్యోగుల టీమ్ లోని అధికారి ఒకరు 'భారతీయులు అడుక్కుతినేవారు' అని వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.

పంజాబ్ సర్వీస్ టీమ్ లో మేనేజర్ గా పని చేస్తున్న అరుణ్ శర్మ అనే ఉద్యోగిని టార్గెట్ చేస్తూ, ఇండియన్స్ కు కల్చర్ లేదని, భారతీయులు డబ్బు కోసమే పని చేస్తారని, డబ్బుల కోసం అడుక్కుంటారని సదరు అధికారి వ్యాఖ్యానించినట్టు విషయం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని అరుణ్ శర్మ, ఓ లేఖ ద్వారా మీడియాకు చేరవేశాడు. దీంతో అటు ప్రసార మాధ్యమాల్లో, ఇటు సామాజిక మాధ్యమాల్లో సంస్థ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవద్దన్న ప్రచారం జోరుగా సాగగా, అమ్మకాలు తగ్గాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని సంస్థ యాజమాన్యం, పంజాబ్ లో పని చేస్తున్న చైనా ఉద్యోగుల టీమ్ తో రాజీనామాలు చేయించిందని తెలుస్తోంది. ఉద్యోగుల రాజీనామా విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సదరు ఉన్నతాధికారి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, జరిగిన ఘటనలో తప్పు చేసిన అధికారిపై చర్యలుంటాయని పేర్కొంది.

More Telugu News