: హైదరాబాద్ లో ఓ విలేకరిపై పోలీసుల దాష్టీకం!

హైదరాబాద్ లో నిన్న అర్ధరాత్రి ఓ న్యూస్ ఛానెల్ విలేకరిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. లాఠీలతో విచక్షణా రహితంగా చితకబాదడంతో సదరు రిపోర్టర్ స్పృహ కోల్పోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. 'మహాన్యూస్' టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్న నాగరాజు, తన స్నేహితుడి తండ్రి చనిపోవడంతో పరామర్శించే నిమిత్తం హైదరాబాద్ లోని చుడిబజార్ కు వెళ్లాడు. అక్కడ పని అయిపోగానే, తిరిగి బయలుదేరాడు. దిల్ షుక్ నగర్ వచ్చేందుకని రోడ్డుపై నిలబడ్డ నాగరాజు వేచిచూస్తుండగా.. అదే సమయంలో కొంతమంది మద్యం సేవించి ఘర్షణ పడుతున్నారు.

అయితే, పోలీసులు రావడాన్ని గమనించిన ఆ వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. నాగరాజు దగ్గరికి వచ్చిన షాయినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్పై రాజు, ‘ఎవరు నువ్వు?’ అని ప్రశ్నించగా, ఫలానా టీవీలో రిపోర్టర్ గా చేస్తున్నట్టు నాగరాజు చెప్పాడు. అయినప్పటికీ, నాగరాజును పోలీస్ వాహనంలో స్టేషన్ కు తీసుకువెళ్లారు. లాఠీలతో చితకబాదడంతో నాగరాజు స్పృహ కోల్పోయాడు. పోలీసులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నాగరాజుపై అకారణంగా దాడి చేసిన ఎస్సై రాజుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News