: బ్యాంకు లావాదేవీల్లో తప్పు జరిగిందా? మూడు రోజుల్లో ఫిర్యాదు చేయకుంటే నష్టపోతారు సుమా!

ఆన్ లైన్ లావాదేవీల్లో జరిగిన పొరపాట్లు, మోసాలపై మూడు రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని, మూడు రోజులు దాటితే జరిమానాల భారం భరించాల్సి వుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ, అందిన ఫిర్యాదులపై పది రోజుల్లోగా బ్యాంకులు విచారించి, ఆ డబ్బును వెనక్కు తిరిగిస్తాయని తెలిపింది. ఒకవేళ, మూడు రోజుల తరువాత, ఏడు రోజుల్లోపు ఫిర్యాదు చేసిన పక్షంలో కస్టమర్లపై లావాదేవీ మొత్తాన్ని బట్టి రూ. 25 వేల వరకూ జరిమానా విధిస్తామని తెలిపింది.

ఏడు రోజుల తరువాత ఫిర్యాదు అందితే మాత్రం బ్యాంకు విధానాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంకుల పొరపాటు లేకుండా కస్టమర్ల నిర్లక్ష్యం (పిన్ నంబర్లు, ఓటీపీలు ఇతరులకు చెప్పడం వంటివి) జరిగితే మాత్రం ఆ మొత్తం పోయినట్టేనని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చే ఉద్దేశంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై ఫిర్యాదులు పెరిగాయని, అందువల్లే నిబంధనలు మార్చామని వెల్లడించింది. 

More Telugu News