: హిందువులను నడిరోడ్డుపైకి లాగుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం!

పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉంటూ అక్కడి పాలకుల కింద అణిగిమణిగి ఉంటున్న హిందువులపై అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని బహావల్ నగర్ జిల్లా హరూనాబాద్ ప్రాంతంలో ఉంటున్న హిందూ కుటుంబాలు, తక్షణం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని తాఖీదులు ఇచ్చారు. ఈ ప్రాంతంలో హిందూ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వచ్చిన అధికారులు, అందరూ అక్రమంగా ఉంటున్న వాళ్లేనని తేల్చి తక్షణం ఇళ్లు వదిలి పోవాలని ఆదేశించారు. ఆ స్థలం ప్రభుత్వానిదని, స్వచ్ఛందంగా ఖాళీ చేయకుంటే బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు.

సుమారు 18 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్ లో హిందువులు ఒక శాతానికి పైగా వుంటారు. అవిభాజ్య భారతావని నుంచి పాక్ విడిపోయిన తరువాత, స్వస్థలాన్ని వదిలిరాలేక అక్కడే ఉండిపోయి, మైనారిటీలుగా మిగిలి తామెన్నో ఇబ్బందులు పడుతున్నామని, నిత్యమూ అవమానాలను ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేయాలంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, బహావల్ నగర్ లోని హిందూ కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని పాకిస్థాన్ ముస్లిం లీగ్ ప్రకటించింది.

More Telugu News