: మైక్రోసాఫ్ట్ లో ప్రకంపనలు... వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన!

ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్, వ్యాపారం మందగించడం తదితర కారణాలతో ఉద్యోగులను భారీ ఎత్తున తొలగిస్తుండగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సైతం ఇదే దారిలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ రీఆర్గనైజేషన్ లో భాగంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ కార్యకలాపాలను పూర్తిగా సమీక్షించనున్నామని, వీరి స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ప్లాట్ ఫాంలను వినియోగించాలని భావిస్తున్నామని, దీని ఫలితంగా ఫీల్డ్ సేల్స్ తదితర విభాగాల్లో వేలమందిని తొలగించాల్సి రావచ్చని సంస్థ అధికారి ఒకరు చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది. పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆయన, మార్చి నాటికి సంస్థలో 1,21,567 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని వారి మెడపై కత్తి వేలాడుతున్నట్టని అన్నారు.

కాగా, సోమవారం నాడు సంస్థ తన ఉద్యోగులకు ఓ లేఖను రాస్తూ, కమర్షియల్ సేల్స్ విభాగాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజిస్తున్నట్టు పేర్కొంది. ఓ భాగం పెద్ద కస్టమర్లకు, మరో భాగం చిన్న, మధ్యతరహా కస్టమర్లకు సేవలందిస్తుందని, ఉద్యోగులను ఉత్పత్తి, ఆర్థిక సేవలు, రిటైల్, వైద్యం, విద్య, ప్రభుత్వాలకు సేవలు అంటూ ఆరు విభాగాలుగా విభజించామని పేర్కొంది. సాఫ్ట్ వేర్ అమ్మకాలను నాలుగు విభాగాలుగా విభజించామని, మోడ్రన్ వర్క్ ప్లేస్, బిజినెస్ అప్లికేషన్స్, యాప్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా అండ్ ఏఐగా మార్చనున్నామని తెలిపింది. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే కస్టమర్లను ఆకర్షించే విషయంలో అమెజాన్, ఆల్ఫాబెట్ (గూగుల్) వంటి సంస్థలతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉద్యోగుల తొలగింపు వార్తతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

More Telugu News