: భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా!

ఓ వైపు భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తూ, చైనా రెచ్చిపోయింది. యుద్ధం జరిగితే ఎదుర్కొనేందుకు ముందుగానే అడుగులు వేస్తోంది. హిందూ మహాసముద్రంలోకి ఓ జలాంతర్గామిని పంపడంతో పాటు, దానికి మద్దతుగా యుద్ధనౌక చాంగ్ మిగ్డవోను మోహరించింది. దక్షిణ హిందూ మహా సముద్రంలో చైనా దూకుడును నిశితంగా గమనిస్తున్న భారత్, సరైన సమయంలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా వుంది.

కాగా, ఈ జలాంతర్గామి యువాన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్ మెరైన్ అని అధికారులు అంటున్నారు. శక్తిమంతమైన మిసైల్ డిస్ట్రాయర్ ను కలిగివుండటం ఇందులోని ప్రత్యేకత, తమ దేశంపైకి దూసుకొస్తున్న క్షిపణులను గాల్లోనే గుర్తించి, వాటిని పేల్చివేస్తుంది. ఇండియాలో ఉన్న క్లాస్ కన్వెన్షనల్ సబ్ మెరైన్లతో పోలిస్తే, ఇది ఆధునికమైనదని తెలుస్తోంది.

ఇక గడచిన వారం రోజులుగా చైనా, భారత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డోకాలా ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణం చేపట్టడం, దాన్ని భారత దళాలు అడ్డుకోవడంతో మొదలైన ఉద్రిక్తత, తాజాగా చైనా జవాన్లను తోసేస్తున్న వీడియోలు విడుదల చేయడం వరకూ వచ్చింది. 1962 నాటి ఇండియా ఇప్పుడు లేదని జైట్లీ వ్యాఖ్యానిస్తే, తామూ అప్పటోళ్లం కాదని చైనా దీటుగానే బదులిచ్చింది. తాజాగా నౌకలు, జలాంతర్గాముల మోహరింపుతో పరిస్థితి తీవ్రంగా మారుతోందన్న సంకేతాలకు బలం చేకూరుతోంది.

More Telugu News