: జీఎస్టీ విషయంలో రికార్డులకెక్కిన ట్విట్టర్.. మూడు రోజుల్లో పది లక్షల పోస్టులు!

దేశంలోనే అతిపెద్ద సంస్కరణగా చెప్పుకుంటున్న వస్తు, సేవల పన్నుపై తమతమ అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రజలు ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్నారు. జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు ఏకంగా పది లక్షల మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల్లో ఇన్ని లక్షల మంది మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. జూన్ 30 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో అప్పటి నుంచే తాము అందుకున్న కొత్త పన్నుల రసీదులను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గ్రోసరీ స్టోర్ల నుంచి హోటళ్ల వరకు జారీ చేసిన రసీదులను ఈ మాధ్యమంలో పోస్ట్ చేశారు. #GSTIndia హ్యాష్ ట్యాగ్ మొదలుకొని #GSTForCommonMan వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నారు.

జీఎస్టీపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ట్విట్టర్ మంచి వేదికగా నిలిచిందని ఆ సంస్థ ఇండియా హెడ్ మహిమా కౌల్ తెలిపారు. జూన్ 30 అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటలకు ట్వీట్లు తారస్థాయికి చేరుకున్నాయని, నిమిషానికి 1,100 ట్వీట్లు నమోదైనట్టు  ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్, జీఎస్టీ ఇండియా, జీఎస్టీ@గోల్, జీఎస్టీ రేట్, జీఎస్టీ, జీఎస్టీ సింప్లిఫైడ్, ఇండియా ఫర్ జీఎస్టీ, ఆస్క్ జీఎస్టీ, జీఎస్టీ ఫర్ కామన్ మ్యాన్, హాఫ్ కుక్‌డ్ జీఎస్టీ, హాఫ్ బేక్‌డీ జీఎస్టీ తదితర హ్యాష్‌ట్యాగ్స్ ప్రముఖంగా కనిపించినట్టు మహిమ వివరించారు.

More Telugu News