: భారత్‌పై మళ్లీ విషం కక్కిన పాక్ ఉగ్రవాది సలాహుద్దీన్.. అమెరికాపై నిప్పులు చెరిగిన ఉగ్రనేత!

పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ (70) భారత్‌పై మరోమారు విషం కక్కాడు. భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో స్వాతంత్ర్యం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశాడు. పనిలో పనిగా అమెరికాపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని నిందించాడు. ‘‘భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వెల్లివిరిసే వరకు మా పోరాటం ఆగదు’’ అని సలాహుద్దీన్ స్పష్టం చేశాడు. పాక్ నియంత్రణలో ఉన్న ముజఫరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. ఈ సమావేశానికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించడం వివాదాస్పదమైంది.

సాయుధ రక్షణ మధ్య మీడియా సమావేశంలో పాల్గొన్న సలాహుద్దీన్ అమెరికా ప్రకటన వెనక ఇజ్రాయెల్, ఇండియా ఉన్నాయన్నారు. పాక్‌పై ఉన్న ద్వేషాన్ని ఇలా తీర్చుకున్నాయని పేర్కొన్నాడు. అమెరికా ప్రకటనను మతిలేని, తెలివిలేని ప్రకటనగా అభివర్ణించాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ కోర్టులు కూడా చెత్తబుట్టలో పడేస్తున్నాయని, పాశ్చాత్య దేశాలు కూడా పట్టించుకోవడం లేదని సలాహుద్దీన్ ఆక్షేపించాడు.

తాను కానీ, కశ్మీరీ పోరాట యోధులు కానీ ఒక్క ఉగ్రవాద చర్యలో అయినా పాల్గొన్నట్టు నిరూపించగలరా? అని అమెరికాకు సవాల్ విసిరాడు. భారత్ భూభాగం లోపల ‘ఫైట్’ చేయగలిగే సత్తా కశ్మీర్ పోరాట యోధులకు ఉందని కితాబిచ్చాడు. అయినా తాము ఆ పని చేయబోమని, దానిని భారత్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడు. చివరిగా పాక్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) హస్తం ఉందని ఆరోపించిన సలాహుద్దీన్.. వాటికి భారత్ అండదండలు పూర్తిగా ఉన్నాయని ఆరోపించాడు.

More Telugu News