: లండన్ వీధుల్లో అద్భుతమైన టెక్నాలజీ: నడిస్తే చాలు విద్యుత్ పుడుతుంది, గాలి శుభ్రమవుతుంది!

లండన్ వీధుల్లో సరికొత్త టెక్నాలజీ సేవలందిస్తోంది. పేవ్ మెంట్ మీద టైల్స్ తో విద్యుత్ ను ఉత్పత్తి చేయడంతో పాటు, గాలిని శుభ్రం చేసే సరికొత్త టెక్నాలజీని 'పేవ్‌ జెన్‌' అనే టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. లండన్ లోని వెస్టెండ్ ప్రాంతంలోని బర్డ్ స్ట్రీట్ ప్రాంతంలోని ఫుట్ పాత్ పై  పేవ్ జెన్ సంస్థ తయారు చేసిన టైల్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టైల్స్ మీద ఎవరైనా నడిస్తే విద్యుత్ పుడుతుంది. పది చదరపు మీటర్ల మేర ఈ టైల్స్ ను పరిచిన పేవ్ జెన్ సంస్థ వీటికి ఎయిర్ లైట్ పెయింట్ ను పూసింది. ఈ పెయింట్‌ గాలిలోని నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి కాలుష్య వాయువులను శుభ్రం చేస్తుంది. అంతే కాకుండా గాలిలోని హానికారక బ్యాక్టీరియాను కూడా హతమారుస్తుంది.

ఈ వీధిలో ఏర్పాటు చేసిన బల్లలు కూడా హైటెక్‌ హంగులతో కూడినవే కావడం విశేషం. ఇవి గాల్లోని నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ ను పీల్చేస్తాయి. శిలాజ ఇంధనాలతో ప్రకృతికి జరుగుతున్న నష్టాన్ని తగ్గించే దిశలో సరికొత్త టెక్నాలజీతో తయారు చేస్తున్న టైల్స్ వంటివి కేవలం తొలి అడుగులు మాత్రమేనని, త్వరలో ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి రానున్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

More Telugu News