: భార‌త సంత‌తి బాలుడికి ఐన్‌స్టీన్ క‌న్నా ఎక్కువ ఐక్యూ!

ఇంగ్లండ్‌కు చెందిన‌ ప‌ద‌కొండేళ్ల భార‌త సంత‌తి బాలుడు అర్న‌వ్ శ‌ర్మ, ప్ర‌పంచంలో అతి క‌ష్ట‌మైన మెన్సా ఐక్యూ టెస్ట్‌లో ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే రెండు మార్కులు ఎక్కువే తెచ్చుకున్నాడు. ఈ ప‌రీక్ష‌లో ఎలాంటి స‌న్న‌ద్ధ‌త లేకుండా అర్న‌వ్ 162 మార్కులు తెచ్చుకున్నాడు. ద‌క్షిణ ఇంగ్లండ్‌లోని రీడింగ్‌లో నివ‌సించే అర్న‌వ్ అతిక‌ష్ట‌మైన వెర్బ‌ల్ రీజ‌నింగ్ ఎబిలిటీ ప‌రీక్ష‌ను సులువుగా పాసైన‌ట్టు మెన్సా వారు తెలిపారు. రెండున్న‌ర గంట‌ల‌పాటు జ‌రిగిన ఈ ప‌రీక్ష‌ను అర్న‌వ్‌తో పాటు ఎనిమిది మంది రాశారు. వారిలో ఇద్ద‌రు మాత్ర‌మే చిన్న‌పిల్ల‌లని అర్న‌వ్ చెప్పాడు.

`ప‌రీక్ష రాస్తున్న‌పుడు అర్న‌వ్ అస‌లు కంగారు ప‌డ‌లేదు. చాలా కూల్‌గా రాశాడు. బ‌య‌ట ఉన్న నేను మాత్రం చాలా కంగారు ప‌డ్డాను` అని అర్న‌వ్ త‌ల్లి మీశా ద‌మీజా శ‌ర్మ చెప్పారు. చిన్న‌వ‌య‌సులో అర్న‌వ్ మంచి విజ‌యాలు సాధిస్తాడ‌ని త‌న త‌ల్లి చెప్పిన‌ట్టు ఆమె గ‌ర్తుచేసుకున్నారు. అర్న‌వ్ రెండేళ్ల వ‌య‌సులోనే గ‌ణితంలో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచేవాడ‌ని మీశా ద‌మీజా శ‌ర్మ వివ‌రించారు. అర్న‌వ్ గ‌ణితంలోనే కాకుండా సంగీతం, నృత్యంలో కూడా బ‌హుమ‌తులు గెల్చుకున్నాడ‌ని ఆమె తెలిపారు. ఎక్కువ ఐక్యూ ఉన్న‌వాళ్ల‌ని గుర్తించ‌డానికి 1946 నుంచి మెన్సా టెస్ట్‌ను నిర్వ‌హిస్తున్నారు. దీన్ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త లాన్స్‌లెట్ లియోన‌ల్ వేర్‌, ఆస్ట్రేలియాకు చెందిన లాయ‌ర్ రోలాండ్ బెర్రిల్‌లు రూపొందించారు.

More Telugu News