: అల్ జ‌జీరా ఛాన‌ల్‌పై సౌదీ అరేబియాకు ఎందుకంత కోపం.. ఏమిటా కథ?

ఖ‌తార్ కేంద్రంగా ప‌నిచేసే అల్ జ‌జీరా ఛాన‌ల్‌పై ఇత‌ర అర‌బ్ దేశాల కోపానికి కార‌ణ‌మేంట‌ని ఆలోచిస్తే మొద‌ట గుర్తొచ్చేది `ష‌రియా అండ్ లైఫ్‌` కార్య‌క్ర‌మ‌మే. ఇందులో ప్రేక్ష‌కులు ఫోన్ ద్వారా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముస్లిం బ్ర‌ద‌ర్‌హుడ్ ఆధ్యాత్మిక నాయ‌కుడు యూసుఫ్ అల్ ఖ‌రాద‌వీ జ‌వాబిస్తుంటాడు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌తానికి, జీవితానికి సంబంధించిన ఎలాంటి ప్ర‌శ్న‌లైనా అడిగే అవ‌కాశం ఉంది. రంజాన్ స‌మ‌యంలో పొగ‌తాగ‌వ‌చ్చా? ఆత్మాహుతి దాడి చేసేట‌పుడు హిజాబ్ ధ‌రించాలా? వ‌ంటి ప్ర‌శ్న‌లు కూడా అడిగేవారున్నారు.

అల్ జ‌జీరా రాక ముందు ఇలాంటి కార్య‌క్ర‌మం ప్ర‌సారం చేయ‌డానికి చాలా అవ‌రోధాలు దాటాల్సివ‌చ్చేది. అల్ జ‌జీరా ప్ర‌వేశంతో అర‌బ్ ప్ర‌పంచ మీడియా జ‌ర్న‌లిజం కొత్త‌పుంత‌లు తొక్కింది. అభిప్రాయ వ్య‌క్తీక‌ర‌ణ‌, వాక్ స్వాతంత్ర్యానికి పునాది ప‌డింది. దీంతో త‌క్కువ స‌మ‌యంలో ఈ ఛాన‌ల్‌కు అభిమానులు, అంతే సంఖ్య‌లో శ‌త్రువులు కూడా పెరిగిపోయారు. ఖ‌తార్‌తో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్ దేశాల్లో కూడా ఇది ప్ర‌సార‌మ‌య్యేది. దీంతో అక్క‌డి పాల‌కుల అభిప్రాయ‌ల‌కు, ఛాన‌ల్ భావ‌జాలానికి పొంత‌న కుద‌ర‌లేదు. ఆయా దేశాల్లో ప్ర‌తిప‌క్షాల‌కు ఈ ఛాన‌ల్ ప్ర‌సారం చేసే అంశాలు బ‌లాన్నిచ్చాయి. ఈ కార‌ణంగా అక్క‌డి పాల‌క‌ప‌క్షాలు అల్ జ‌జీరాను వారి దేశాల నుంచి బ‌హిష్క‌రించాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుత దౌత్య వివాదంలో భాగంగా అల్ జ‌జీరాను మూసివేయాల‌ని పొరుగు అర‌బ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తం మ‌ధ్య ప్రాచ్యంలో దాదాపు 350 మిలియ‌న్ల మంది అర‌బ్బులు ఉన్నారు. 1950 కాలంలో వీరందరిని ఐక్యం చేయ‌గ‌ల ఈజిప్ట్ అధ్య‌క్షుడు గ‌మాల్ అబ్దుల్ నాస‌ర్ భావ‌జాలాన్ని ప్ర‌చారం చేయ‌డానికి ఈజిప్ట్ కేంద్రంగా ప‌నిచేసే స్వాట్ అల్ అర‌బ్ రేడియో మాత్ర‌మే ఉండేది. 1990 వ‌చ్చే స‌రికి సౌదీ రాజ‌కుటుంబం వారు పంచిపెట్టే అర‌బ్ వార్తాప‌త్రిక‌లు, శాటిలైట్ ఛాన‌ల్ ఎంబీసీ అందుబాటులోకి వ‌చ్చాయి.

ఖ‌తార్ దేశ రాజ‌కీయాల్లో కూడా అల్ జ‌జీరా వ్యాఖ్యానాలు కీల‌క పాత్ర పోషిస్తుండ‌టంతో పాల‌క ప్ర‌భుత్వం ఛాన‌ల్ అభివృద్ధి కోసం కోట్లు కుమ్మ‌రించింది. ఇత‌ర అర‌బ్ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేయ‌ని ఇజ్రాయిల్ ప్ర‌తిఘ‌ట‌న వీడియోలు, అర‌బ్బులు ముస్లింల మ‌ధ్య ఏకీకృత భావ‌న‌ల చ‌ర్చ‌లు వంటి అంశాల‌ను ప్ర‌సారం చేసి అల్ జ‌జీరా ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుంది. అలాగే ఇజ్రాయిల్ పార్ల‌మెంట్ (నెసెట్‌)లో జ‌రిగే విష‌యాలు, 2008 గాజా యుద్ధాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది. బిన్ లాడెన్ టేపులు, ఇరాక్-అమెరికా యుద్ధ స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లు కూడా ప్ర‌సారం చేసింది. 2006 నాటికి 75 శాతం మంది అర‌బ్బుల విశ్వాసాన్ని అల్ జ‌జీరా చూర‌గొంది. ఇలా విజ‌యాల‌తో పాటు కొన్ని వైఫ‌ల్యాలు కూడా ఉన్నాయి. 2011, సెప్టెంబ‌ర్ 11న అమెరికా విదేశీ విధానం గురించి చేసిన ప్ర‌సారాన్ని అమెరిక‌న్లు తూల‌నాడారు. అలాగే 2012లో అల్ జ‌జీరా ఇంగ్లిషు ఛాన‌ల్‌పై చైనా చ‌ర్య తీసుకుంది.

ఇక ఛాన‌ల్‌ను మూసివేయాల‌న్న డిమాండ్లపై కూడా వీరి యాజ‌మాన్యం గ‌ట్టిగానే స్పందించింది. ఈ డిమాండ్‌ను మీడియా స్వేచ్ఛ‌కి భంగంగా కొట్టిపారేసింది. ఏదేమైనా ఈ ఛాన‌ల్‌లో ప‌నిచేసే పాత్రికేయులు మాత్రం పైకి ధైర్యంగా క‌నిపిస్తున్నా లోలోప‌ల మాత్రం ఛాన‌ల్ మూత ప‌డితే త‌మ ప‌రిస్థితి ఏంటో అర్థం కాక మ‌ధన‌ప‌డుతున్నారు.

More Telugu News