: భారీ భూకంపం హెచ్చరికతో ప్రజలను భయపెట్టిన అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం.. కంప్యూటర్ తప్పిదమని తేల్చిన అధికారులు!

భారీ భూకంపం అంటూ ప్రజలు, అధికారులు, న్యూస్ ఛానెళ్లను అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) బెంబేలెత్తించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూఎస్జీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. అంతే, ఈ హెచ్చరికలు అమెరికాలోని అన్ని న్యూస్ ఛానెళ్లకు వెళ్లాయి. క్షణాల్లో అన్ని ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ వెలువడడంతో కాలిఫోర్నియాతో పాటు అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. ప్రజలంతా అప్రమత్తమయ్యారు. ఇంతలో అధికారులు అసలు విషయం గుర్తించి, ఆ హెచ్చరిక సాంకేతిక తప్పిదమని, జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నామని ప్రకటించారు.

 దీంతో మళ్లీ బ్రేకింగ్ న్యూస్ పడింది. రిక్టర్‌ స్కేలుపై 6.8 త్రీవతతో భూకంపం రావడం నిజమేనని...అయితే ఆ భూకంపం తాజాగా సంభవించినది కాదని, 92 ఏళ్ల క్రితం 1925లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అప్పట్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని, కంప్యూటర్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఆనాటి మెసేజ్ తాజాగా మళ్లీ వెలువడిందని, దీంతో భూకంపం వచ్చిందని పొరబడ్డామని, మళ్లీ అన్నీ సరిచూసుకోగా భూకంపం హెచ్చరిక సాంకేతిక తప్పిదమని అర్థమైందని అధికారులు తెలుపుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

More Telugu News