: ఏ అధికారి అలా అన్నాడో చెప్పు!: కుంబ్లేపై గవాస్కర్ ఒత్తిడి

బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లోని ఏ అధికారి కుంబ్లేతో మాట్లాడుతూ విరాట్ అసంతృప్తిని గురించి వివరించాడో తెలియాల్సిన అవసరం ఉందని మాజీ కెప్టెన్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరు తనకు కోహ్లీ గురించి చెప్పారన్న విషయాన్ని కుంబ్లే బయటకు వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. బీసీసీఐ అధికారి ఒకరు కోహ్లీ తనను ఇష్టపడటం లేదని చెప్పగా, తానెంతో ఆశ్చర్యపోయినట్టు కుంబ్లే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కుంబ్లే, కోహ్లీల మధ్య ఉన్న విభేదాల గురించిన వార్తలు, క్రీడాభిమానుల్లో అయోమయాన్ని కలిగిస్తున్నాయని గవాస్కర్ అన్నారు. ఇది క్రికెట్ భవిష్యత్తుకు అనారోగ్యకర పరిణామమని చెప్పుకొచ్చాడు. అనిల్ కుంబ్లే పాటిస్తున్న శిక్షణా పద్ధతులను కెప్టెన్ కోహ్లీ, జట్టు సభ్యులు నచ్చకపోవడం వల్లే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించిన గవాస్కర్, జట్టు వెస్టిండీస్ లో ఉండగానే, సమస్యను చక్కదిద్దాల్సిన అవసరం బీసీసీఐకి ఉందని చెప్పారు. ఇప్పటికే పది మంది వరకూ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని ఉన్నారని, వీరిలో ఎవరినో ఒకరిని కోచ్ గా నియమించాలని సలహా ఇచ్చారు. కుంబ్లే పద్ధతులు నచ్చకుంటే, అవి ఎలాంటివో తెలుసుకోవాలని, మరోసారి అదే పరిస్థితి ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News