: దేశంలోనే తొలిసారి.. డీజిల్‌ను హోం డెలివరీ చేస్తున్న బెంగళూరు సంస్థ!

బెంగళూరు వాసులకు బంకుకు వెళ్లి డీజిల్ కొట్టించుకునే బాధ తప్పింది. ఇక నుంచి పాలు, పేపర్‌లానే డీజిల్ కూడా ఇంటికే రానుంది. ఇందుకోసం ఓ సంస్థ హోం డెలివరీ సర్వీసులు ప్రారంభించింది. గతేడాది ప్రారంభమైన ‘మై పెట్రోల్ పంప్’ డాట్ కామ్ అనే సంస్థ ఈనెల 15న హోం డెలివరీ సేవలను ప్రారంభించింది. ఒక్కోటి 950 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 5వేల లీటర్లకు పైగా ఈ సంస్థ డెలివరీ చేసింది. రోజువారీ మారే ధరలకు అనుగుణంగా డీజిల్‌ను ఈ సంస్థ అందిస్తుంది.

అయితే డెలివరీ కోసం కొంత మొత్తం వసూలు చేస్తుంది. వంద లీటర్ల డీజిల్‌కు రూ.99 వసూలు చేస్తుంది. అంతకు పైన అదనంగా ప్రతీ లీటర్‌కు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంస్థకు ఇప్పటికే 20 మంది వినియోగదారులు ఉన్నారు. 16 స్కూళ్లు, అపార్ట్‌మెంట్లు కూడా  ఉన్నాయి. ఆన్‌లైన్, ఫోన్ కాల్, యాప్ ద్వారా డీజిల్‌ను బుక్ చేసుకోవచ్చని ‘మై పెట్రోల్‌ పంప్’ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ గుప్తా (32) తెలిపారు. తాము కేవలం డెలివరీ ఏజెంట్లలానే పనిచేస్తామని, డీజిల్‌ను కొనుగోలు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ చేయబోమని ఆయన వివరించారు. వినియోగదారుడి నుంచి ఆర్డర్ రాగానే పెట్రోల్ పంప్‌కు వెళ్లి నింపించుకుని కస్టమర్‌కు డెలివరీ చేస్తామని చెప్పుకొచ్చారు.

More Telugu News