: పీఎస్ఎల్వీ-సీ38 ప్రయోగానికి సర్వం సిద్ధం... రేపే ప్రయోగం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనతలంలో మరో 31 ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 160 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం ఇస్రోకు అత్యంత విశ్వాసపాత్రమైన పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ)- సీ38ను రూపొందించారు. దీనితో కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహంతో పాటు తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని, అలాగే ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సహా మరో 8 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

 ఈ ఉపగ్రహవాహక నౌక ద్వారా నింగిలో ప్రవేశపెట్టనున్న కార్టోశాట్-2ఇ బరువు 712 కేజీలు కాగా, మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు కావడం విశేషం. ఈ మేరకు కౌంట్ డౌన్ నేటి ఉదయం 5.08 నిమిషాలకు ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైన 28 గంటల అనంతరం నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం-షార్‌ నుంచి ప్రయోగం జరగనుంది. రేపు ఉదయం 9.29 నిమిషాలకు జరగనున్న ఈ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగం ద్వారా పంపనున్న కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహంతో భూ పరిశీలన సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది జూన్‌ 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 15న రెండు కార్టోశాట్ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టగా, ఆ రెండూ సేవలందిస్తున్నాయి.

More Telugu News