: ఎఫ్-16ల తయారీ కోసం ఇండియాకు తరలిరానున్న లాక్ హీడ్ మార్టిన్

అధునాత ఎఫ్‌ - 16 యుద్ధ విమానాలు ఇకపై ఇండియాలోనే తయారవుతాయి. ఈ మేరకు టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌), అమెరికన్‌ ఏరోస్పేస్‌ సేవల సంస్థ లాక్‌ హీడ్‌ మార్టిన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. పారిస్‌ లో జరుగుతున్న ఎయిర్‌ షోలో భాగం పంచుకున్న ఇరు కంపెనీల మధ్యా కుదిరిన డీల్ ప్రకారం, మేకిన్‌ ఇండియాకు ఊతమిస్తూ, యూఎస్ లోని టెక్సాస్‌ పరిధిలోని ఫోర్ట్‌ వర్త్‌ లో ఉన్న తన ప్లాంటును లాక్ హీడ్ మార్టిన్ ఇండియాకు తరలించనుంది.

కాగా, భారత్ వద్ద ఇప్పటికీ రష్యాలో రెండో ప్రపంచ యుద్ధానికి ముందు తయారైన యుద్ధ విమానాలే అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతున్న అవసరాలు, సరిహద్దుల నుంచి పెరుగుతున్న భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త తరహా యుద్ధ విమానాలను కనీసం 250 వరకూ సమకూర్చుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎఫ్-16 యుద్ధ విమానాల తయారీలో అగ్రగామిగా ఉన్న లాక్ హీడ్ ఇండియాలో ప్లాంటు పెట్టేందుకు ముందుకు రావడంతో ఈ డీల్ కుదిరింది. ఇకపై తాము భారత్ తో కలసి పని చేస్తామని, ఇండియాలో తయారయ్యే యుద్ధ విమానాలను ఎగుమతి చేయాలన్న ఆలోచన కూడా ఉందని లాక్ హీడ్ అధికారి ఫిల్ హోవార్డ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, లాక్‌ హీడ్‌ మార్టిన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓర్లాండో కర్వాలో పాల్గొనగా, టీఏఎస్‌ఎల్‌ సీఈవో సుకరణ్‌ సింగ్, లాక్‌ హీడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జార్జ్‌ స్టాండ్‌ రిడ్జ్‌ లు డీల్ పై సంతకాలు చేశారు. ఇప్పటివరకూ దాదాపు 4,500కు పైగా ఎఫ్‌ - 16 యుద్ధ విమానాలను లాక్ హీడ్ మార్టిన్ తయారు చేయగా, అవి 26 దేశాల్లో సేవలందిస్తున్నాయి.

More Telugu News