: పాక్ పేసర్లతో టీమిండియా బ్యాట్స్ మన్ కు ముప్పు లేదు: గౌతమ్ గంభీర్

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్‌ పేసర్ల నుంచి టీమిండియా బ్యాట్స్ మన్ కు వచ్చిన ముప్పేమీ లేదని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. పాక్ పేసర్లు మహ్మద్‌ ఆమిర్‌, జునైద్‌ ఖాన్‌, హసన్‌ అలీ ఇతర జట్లపై రాణించినా టీమిండియాపై తేలిపోతారని అన్నాడు. గతంలో షోయబ్ అఖ్తర్, ఉమర్ గుల్ వంటి బౌలర్ల నుంచి పోటీ ఉండేదని గంభీర్ తెలిపాడు. వారి అంత నాణ్యమైన బౌలర్లు పాక్ జట్టులో ఇప్పుడు లేరని చెప్పాడు. పాక్ జట్టుకు అనుభవం కూడా లేదని గంభీర్ తెలిపాడు. టీమిండియాలో అనుభజ్ఞులైన బ్యాట్స్ మన్ ఉన్నారని చెప్పాడు.

ఎన్నో ఏళ్లుగా భారత్‌-పాక్‌ పోరంటే భారత బ్యాటింగ్‌, పాకిస్థాన్‌ బౌలింగ్‌ కు మధ్యే పోటీ అన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ పిచ్ లు ఫ్లాట్ గా ఉన్నాయని చెప్పాడు. ఇప్పటి బౌలర్లకు పరిస్థితులు అనుకూలిస్తే తప్ప వారి వల్ల టీమిండియాకు వచ్చిన ముప్పేమీ ఉండదని గంభీర్ తేల్చి చెప్పాడు. బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సూచించాడు. రెండు జట్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉండంతో స్పిన్నర్ల కంటే పేసర్ల వల్లే ఉపయోగమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బలంగా ఉన్నాయని గంభీర్ తెలిపాడు. 

More Telugu News