: బంగ్లా చేతిలో చిత్తయిన కివీస్!

చాంపియన్స్ ట్రోఫీ నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమించింది. అండర్ డాగ్ గా గ్రూప్ బి నుంచి బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటమితో న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, నేడు జరగనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం తేలేవరకు బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు సజీవంగా వుంటాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడితే... బంగ్లాదేశ్ సెమీఫైనల్ కు చేరుతుంది. ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే బంగ్లా ఇంటికి చేరుతుంది.

నిన్న కార్డిఫ్ లో జరిగిన వన్డేలో బంగ్లా అద్భుత ప్రదర్శన చేసి, విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ ను బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఒక దశలో బలంగా కనిపించిన కివీస్ ను అద్భుతంగా కట్టడి చేసి, 265 పరుగులకు పరిమితం చేశారు. విలియమ్సన్ (57), రాస్ టేలర్ (63) అర్ధసెంచరీలతో రాణించగా, గుప్టిల్ (33), బ్రూమ్ (36), నీషమ్ (23) ఆకట్టుకున్నారు. రోంచి (16), కోరె ఆండర్సన్ (0), మైల్ (7) విఫలమయ్యారు. శాంటనర్ (14), సౌతీ (10) చివర్లో నిలబడడంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మడ్ హాక్ మూడు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో టస్కిన్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. వారికి ముస్తాఫిజుర్, రూబెల్ హాసన్ సహకరించారు.

అనంతరం 266 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కు కివీస్ బౌలర్లు ఆదిలో చుక్కలు చూపించారు. తమీమ్ ఇక్బాల్ (0), సౌమ్యా సర్కార్ (3), సబ్బీర్ రెహ్మాన్ (8) ను టిమ్ సౌతీ పెవిలియన్ కు పంపడంతో బంగ్లా జట్టు కనీసం 150 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానం వచ్చింది. ముష్ఫికర్ (14) కూడా అవుట్ కావడంతో ఆన్ లైన్ లో అభిమానుల ఓటింగ్ కూడా బంగ్లా ఓటమి ఖాయమని తేల్చేశారు. కానీ క్రీజులోకి వచ్చిన షకిబల్ హసన్ (114), మహ్మదుల్లా (105) అద్భుతంగా ఆడి తిరుగులేని విజయం అందించిపెట్టారు. ఆరంభంలో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన షకిబల్, మహ్మదుల్లా వేగం పెంచి, నిలకడగా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు.

More Telugu News