: 'భూమి గుండ్రంగా లేదు... ఐన్ స్టీన్, న్యూటన్ సిద్ధాంతాలు శుద్ధతప్పు' అంటున్న ట్యునీషియా యువతి!

ఈ విశ్వం గురించి ఇన్నాళ్లు మనం చదివిందంతా ఓ నాన్సెన్స్ అంటోంది ఓ విద్యార్థిని. మహామహులైన శాస్త్రవేత్తలు కనుగొన్న సిద్ధాంతాలు అన్నీ ఓ ట్రాష్ అంటోంది ఈ స్టూడెంట్. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఆమె తన వాదన వినిపిస్తోంది. "ఇంతకాలం చదివిన చదువంతా తప్పు... భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉంది. కోపర్నికస్, కెప్లర్ ప్రతిపాదిత ఖగోళ శాస్త్రమంతా తప్పుల తడక...భూమి సూర్యుడి చుట్టూ తిరగడం లేదు. విశాల విశ్వంలో గెలాక్సీ ఒక్కటే ఉంది... అందులో భూమి నిశ్చలంగా ఎటూ కదలకుండా ఉంది....భూమి పుట్టి కోట్ల ఏళ్లు కాలేదు... కేవలం 3,500 ఏళ్లు మాత్రమే అయింది. బిగ్ బ్యాంగ్ థియరీ అబద్ధం....న్యూటన్, ఐన్ స్టీన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలన్నీ తప్పుల తడకలే" అంటూ ట్యూనిషియాకు చెందిన సదరు యువతి సరికొత్త ప్రతిపాదన చేసింది.

ఇందుకు సంబంధించి ఈమె రాసిన పీహెచ్డీ ధీసీస్ తొలి భాగాన్ని ఇద్దరు ప్రొఫెసర్లు కూడా అంగీకరించడం విశేషం. దీనిపై ‘అమెరికా యూనివర్శిటీ ఆఫ్‌ షార్జా’లో భౌతిక, ఖగోళశాస్త్ర ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న నిదాల్‌ గెస్సామ్‌ మాట్లాడుతూ, ఈ సిద్ధాంతాన్ని యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఓకే చేయక ముందు, పూర్తిగా ప్రచురించకముందు ఇది బయటకు లీకవడం మంచిదైందని అన్నారు. దీనిని ప్రతిపాదించిన యువతి కేవలం ఇస్లాం మత విశ్వాసాల ఆధారం చేసుకుని సరికొత్తగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందని అన్నారు. ఆమె శాస్త్ర విజ్ఞానాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. మతం, శాస్త్రం రెండూ పవిత్రమైనవేనని చెప్పిన ఆయన ఈ రెంటినీ కలిపి అపవిత్రం చేయవద్దని సూచించారు.

రెండేళ్ల క్రితం భూమి బల్లపరుపుగా ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఒక మత గురువు వ్యాఖ్యానించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా ‘ఫ్లాట్‌ ఎర్త్‌’ అని ఇంటర్నెట్ లో టైప్ చేస్తే పది లక్షల యూట్యూబ్ వీడియోలు, నాలుగు లక్షల పత్రాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. వీటిలో సగం పత్రాలు భూమి బల్లపరుపుగా ఉందనే వాదిస్తాయని ఆయన చెప్పారు. అయితే అంతరిక్ష పరిశోధనల పరంగా తీసిన ఫోటోలు, ఇతర శాస్త్రపరిజ్ఞాన సాక్షాలను పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి వాదనలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయులు ఖండించాలని సూచించారు. అలా ఖండించని పక్షంలో వారు చేసిన వాదనే వాస్తవమనే భ్రమలు కలుగుతాయని, అది ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వాదనలే వినిపించడం అవగాహనా రాహిత్యమని ఆయన అన్నారు.

More Telugu News