: సెహ్వాగ్ నన్ను ఎంతో నిరుత్సాహపరిచాడు.. చివరకు అలా బోల్తా కొట్టించా!: అశ్విన్

డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ ఎవరు అని అడిగితే... అందరికంటే ముందు గుర్తుచ్చే ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. ఫార్మాట్లతో సంబంధం లేకుండా... బౌలర్లను ఊచకోత కోయడంలో వీరూను మించినవాడు లేడంటే అతిశయోక్తి కాదు. అందుకే, వీరూ క్రీజులో ఉన్నాడంటే... ఒక్కరు కూడా టీవీ ముందు నుంచి కదిలేవారు కాదు. ఇదిలా ఉంచితే, తాజాగా 'వాట్ ది డక్ 2' చాట్ షోలో భారత అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... సెహ్వాగ్ గురించి ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆ సమయంలో భారత్ జట్టులో స్థానం నిలబెట్టుకునేందుకు అశ్విన్ తంటాలు పడుతున్నాడు. అశ్విన్ ఏం చెప్పాడో అతని మాటల్లోనే చూద్దాం...

"నా తొలి రోజుల్లో సెహ్వాగ్ నన్ను ఎంతో నిరుత్సాహపరిచాడు. దంబుల్లాలో జరిగిన ఒక ఘటన గురించి చెబుతా. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు... నేను సెహ్వాగ్ కు బౌలింగ్ చేశా. తొలి బంతిని ఆఫ్ స్టంప్ బయటకు వేశా. సెహ్వాగ్ కట్ చేశాడు. రెండో బంతిని హాఫ్ స్టంప్ పైకి వదిలా. మళ్లీ కట్ చేశాడు. తర్వాతి బంతిని మిడిల్ స్టంప్ పైకి సంధించా. మళ్లీ సేమ్... కట్ చేశాడు. నాలుగో బంతిని లెగ్ స్టంప్ పైకి వదిలా. మళ్లీ కట్ చేశాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఏం జరుగుతోంది? అంటూ గట్టిగా అరిచా. ఆ తర్వాత ఫుల్లర్ డెలివరీ వేశా. ఫ్రంట్ ఫుట్ ఆడి, సిక్స్ కొట్టాడు. నేను 'ఓకే ఫైన్' అని అనుకున్నా. నా బౌలింగ్ సరిగా లేదేమో... లేదా ఇతను అద్భుతంగా ఆడుతున్నాడేమో అనుకున్నా.

ఆ తర్వాత సెహ్వాగ్ వద్దకు వెళ్లా. నేను ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలని అడిగా. అదే సచిన్ నో, ధోనీనో అడిగితే వారు టిప్స్ చెప్పేవారు. కానీ సెహ్వాగ్ ఏమన్నాడంటే... ఆఫ్ స్పిన్నర్లు అసలు బౌలర్లే కాదని అన్నాడు. తనను ఆఫ్ స్పిన్నర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేరని... ప్రతి బంతినీ ఈజీగా స్మాష్ చేసేస్తానని సెహ్వాగ్ చెప్పాడు. సార్, మీరు నా బంతులను ఎందుకు కట్ చేశారు? అని అడిగా. ఆఫ్ స్పిన్నర్ల బంతులను ఆఫ్ సైడ్ వైపుకు బాదడం... లెఫ్టామ్ స్పిన్నర్లను లెగ్ సైడ్లో ఉతికి ఆరేయడం తనకు పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు.

మరుసటి రోజు నెట్లో మళ్లీ సెహ్వాగ్ కు బౌలింగ్ చేశా. లెక్క లేకుండా ప్రతి బంతినీ బాదాడు. 10 ఏళ్ల కుర్రాడి బౌలింగ్ లో నేను ఎలా బ్యాటింగ్ చేస్తానో... నా బౌలింగ్ ను సెహ్వాగ్ అలా చితక్కొట్టాడు. ఇలాగే మరికొన్ని ప్రాక్టీస్ సెషన్లు గడిచిపోయాయి. ఆ తర్వాత సెహ్వాగ్ ను ఎలా బోల్తా కొట్టించాలో బాగా ఆలోచించి, చివరకు సక్సెస్ అయ్యా. చెత్త బంతిని వేస్తే సెహ్వాగ్ అవుటవుతాడని అనుకున్నా. ఆ తర్వాత చెత్త బంతిని వేసి ఆయనను ఔట్ చేశా. ఐపీఎల్ లో కూడా చెత్త బంతులు వేసి, సెహ్వాగ్ ను కొన్ని సార్లు ఔట్ చేశా. వాస్తవానికి ఒక బౌలర్ నుంచి సెహ్వాగ్ మంచి బంతులనే ఊహిస్తాడు. బంతి పడిందా, బౌండరీకి తరలిద్దామా అనే కోణంలోనే వీరూ బ్యాటింగ్ చేస్తాడు. సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడం, టెండూల్కర్ కు బౌలింగ్ చేయడం కంటే చాలా కష్టం.  మరో విషయం ఏమిటంటే... టీమ్ మీటింగులకు హాజరుకావడం కూడా సెహ్వాగ్ కు ఇష్టం ఉండదు."... ఈ విధంగా సెహ్వాగ్ గురించి చాట్ షోలో చెప్పుకుంటూ పోయాడు అశ్విన్.

More Telugu News