: 1100కి డయల్ చేయండి.. ఇచ్చిన లంచం సొమ్మును వెనక్కి తీసుకోండి.. ఏపీలో అద్భుత ఫలితాలు ఇస్తున్న ‘పీపుల్ ఫస్ట్’

మీ పని చేయించుకోవడం కోసం ఇటీవల ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారా? మరేం పర్లేదు.. 1100కి డయల్ చేయండి.. లంచం తీసుకున్న అధికారే మీ ఇంటికొచ్చి తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. ఏపీలో గతనెలలో ప్రారంభించిన ‘పీపుల్ ఫస్ట్’ కాల్ సెంటర్ అద్భుత ఫలితాలు ఇస్తోంది. అత్యంత అవినీతిమయ రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించినట్టు ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో అవినీతి అంతుచూడాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 12 మంది అధికారులు తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. పంచాయతీ కార్యదర్శి ఒకరు పదిమందికి లంచం డబ్బులను వెనక్కి ఇచ్చినట్టు సీఎం తెలిపారు. మే 25 ప్రారంభించిన 1100 కాల్ సెంటర్‌కు విపరీతమైన ఆదరణ వస్తోందని తెలిపారు. బాధితుల నుంచి కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు. తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వివరించారు. రూ.500, రూ.1000 తీసుకున్న అధికారులు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నా వారిని గుర్తిస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ప్రతీ కేసు విషయంలో డబ్బులు తిరిగి వస్తాయని ప్రభుత్వం కచ్చితంగా చెప్పలేకపోతోంది.

More Telugu News