: ఎయిర్‌టెల్, జియో మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం.. జియో జమ్ముకశ్మీర్ లైసెన్స్ రద్దు చేయాలన్న ఎయిర్‌టెల్!

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మార్కెట్‌ను రక్తికట్టిస్తున్నారు. తాజాగా జియో జమ్ముకశ్మీర్ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎయిర్‌టెల్ డిమాండ్ చేస్తోంది. ఆ రాష్ట్రంలోని తమ వినియోగదారుల్లో 95 శాతం మందిని పోస్ట్ పెయిడ్ వినియోగదారులుగా చెబుతోందని, నిజానికి వారంతా ప్రీపెయిడ్ కస్టమర్లేనని వాదిస్తోంది. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న జియోతో భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆరోపిస్తోంది.

అయితే, భారతీ ఎయిర్‌టెల్ ఆరోపణలను జియో కొట్టిపడేసింది. ఆ ఆరోపణలు పసలేని, నిరాధార, పనికిమాలిన ఆరోపణలని తీవ్రస్థాయిలో స్పందించింది. జమ్ముకశ్మీర్‌లోని 7 లక్షల మంది తమ వినియోగదారులను రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులుగా చెబుతోందని, నిజానికి వారంతా ప్రిపెయిడ్ వినియోగదారులని ఎయిర్‌టెల్ ఆరోపిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇస్తున్నట్టే వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా ఉచిత ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను తమవైపు తిప్పుకుంటోందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. లెక్కలను తారుమారు చేసి, నిబంధనలు ఉల్లంఘించి అందరూ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులేనని చెబుతోందని మండిపడింది. వెంటనే జియో లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఎయిర్‌టెల్ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని జియో ఓ లేఖలో దుమ్మెత్తి పోసింది. జమ్ముకశ్మీర్‌లో ఈనెల మొదట్లో ప్రిపెయిడ్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసినా ఎయిర్‌టెల్ మాత్రం ఇన్‌‌కమింగ్ కాల్స్‌ను అనుమతించిన విషయాన్ని తాము బయటపెట్టడంతో జీర్ణించుకోలేకే ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జియో పేర్కొంది.

More Telugu News