: ఉత్తర కొరియా అణ్వాయుధాన్ని ఇలా నాశనం చేస్తాం... చేసి చూపించిన అమెరికా!

ఓవైపు అమెరికాపై అణుబాంబు వేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తర కొరియా భయపెడుతున్న వేళ, అటువంటి పరిస్థితే వస్తే, తామేం చేస్తామో అమెరికా చేసి చూపించింది. ఉత్తర కొరియా వద్ద ఉన్న ఖండాంతర క్షిపణులతో పోలిస్తే, మరింత శక్తిమంతమైన క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంపై ప్రయోగించి, దాన్ని ఆకాశంలోనే తుత్తునియలు చేసే పరీక్షలో విజయవంతమైంది. గ్రౌండ్ ఆధారిత మిడ్-కోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ను వాడుతూ, ఐదు అడుగుల పొడవైన 'కిల్ వెహికిల్'ను ప్రయోగించి, ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్)ను ధ్వంసం చేసింది.

ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మాక్ టెస్టును మార్షల్ దీవుల్లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్ నుంచి ప్రయోగించామని, దాన్ని అడ్డుకునే కిల్ వెహికిల్ ను కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి ప్రయోగించామని తెలిపారు. కాగా, ఈ పరీక్ష మంగళవారం ఉదయం జరిపామని, తమ సత్తా ఏంటన్న విషయాన్ని నార్త్ కొరియాకు గుర్తు చేసేందుకే ఇలా చేశామని నేవీ కెప్టెన్, పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వ్యాఖ్యానించారు.

More Telugu News