: తక్షణం జాదవ్ ను ఉరి తీయండి: పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్

తమ వద్ద బందీగా ఉన్న భారత మాజీ నావికాధికారి కులభూషణ్ జాదవ్ ను సాధ్యమైనంత త్వరగా ఉరి తీసేందుకు పాక్ ఉవ్విళ్లూరుతోంది. పాక్ సైనిక కోర్టు ఇచ్చిన మరణదండన శిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించడంతో అవాక్కైన ఆ దేశం, ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాదవ్ ను తక్షణం ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, మాజీ సెనేట్ చైర్మన్ ఫరూక్ నయీక్ పేరిట న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

వెంటనే జాదవ్ ను ఉరితీసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరగా, దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని 'డాన్' పత్రిక పేర్కొంది. కాగా, తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేందుకు వచ్చిన జాదవ్ ను బెలూచిస్థాన్ లో అరెస్ట్ చేశామని పాక్ ప్రకటించగా, అది అవాస్తవమని, ఆయన్ను ఇరాన్ లో పట్టుకుని పాక్ తెచ్చారని ఆ దేశ నిఘా అధికారి ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News