: యూజ్‌డ్ ఫోన్లలో భారతీయుల ఓటు శాంసంగ్‌కే.. ఆ తర్వాతే ఆపిల్!

ప్రి-ఓన్‌డ్ ఫోన్లలో భారతీయుల ఓటు సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్‌కే పడింది. సెకెండ్ హ్యాండ్ ఫోన్లను కొనాల్సి వస్తే భారతీయులు తొలుత ఎంచుకునేది శాంసంగ్‌నేనని ఓ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాతే ఆపిల్, షియోమీ లెనోవో వంటి ఫోన్ల గురించి ఆలోచిస్తారని తేలింది. ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్‌ఎక్స్‌లో గతేడాది మొత్తం కోటి యూజ్‌డ్ ఫోన్లు లిస్ట్ కాగా 25 శాతం మార్కెట్ షేర్‌ను శాంసంగ్ సొంతం చేసుకుంది. అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ 20 శాతం మార్కెట్ షేర్‌తో రెండో స్థానంలో నిలిచింది. షియోమీ 9 శాతం, లెనోవో (మొటోరోలాతో కలుపుకుని) 8.5 శాతం, మైక్రోమ్యాక్స్ 3.5 శాతం మార్కెట్ షేర్‌ను సాధించాయి. మిగతా ఫోన్ల బ్రాండ్లు అన్నీ కలిపి మొత్తం మార్కెట్ షేర్‌లో 34 శాతం సాధించాయి.

ప్రస్తుతం ప్రి-ఓన్‌డ్ మొబైల్ మార్కెట్ 2 కోట్ల మార్కుకు చేరుకుందని ఓఎల్ఎక్స్ ఇండియా సీఈవో అమర్‌జిత్ బాత్రా తెలిపారు. ప్రస్తుతం యూజ్‌డ్ ఫోన్ల మార్కెట్ ఆఫ్‌లైన్‌లో జోరుగా సాగుతోందని, క్రమంగా అది ఆన్‌లైన్‌కు మళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓఎల్‌ఎక్స్ ద్వారా ప్రతిరోజు 5,500 ప్రి-ఓన్‌డ్ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని, ఏడాదికి ఇంచుమించు 2-3 మిలియన్ల ఫోన్లు ఓఎల్‌ఎక్స్ ద్వారా అమ్ముడుపోతున్నట్టు బాత్రా వివరించారు.

More Telugu News