: లియోనెల్ మెస్సీకి జైలు శిక్ష, జరిమానా

అర్జెంటినా స్టార్ ఫుట్‌ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి జైలు శిక్ష, జరిమానాను న్యాయస్థానం విధించింది. డానోన్, అడిడాస్, పెస్పీ-కోలా, ప్రొక్టార్ అండ్ గ్యాంబిల్, కువైట్ ఫుడ్ వంటి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, తద్వారా పొందిన ఆదాయానికి పన్ను చెల్లించని కారణంగా శిక్ష విధిస్తూ బార్సిలోనా కోర్టు 2016లో తీర్పునిచ్చింది. దీనిపై మెస్సీ స్పెయిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన స్పెయిన్ సర్వోన్నత న్యాయస్థానం...మెస్సీని దోషిగా నిర్ధారిస్తూ, 21 నెలల జైలు శిక్షతో పాటు 2.09 మిలియన్ యూరోల (దాదాపు 15 కోట్ల రూపాయలు) ను జరిమానా విధించింది.

పన్నులు ఎగవేసేందుకు మెస్సీ పేరిట బెలీజీ, స్విట్జర్లాండ్, ఉరుగ్వే, బ్రిటన్ దేశాల్లో భోగస్ కంపెనీలు సృష్టించారని న్యాయస్థానం తెలిపింది. కాగా, ఈ కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానంలో మెస్సీ తన వాదనలు వినిపిస్తూ, ఆర్థిక వ్యవహారాలు తన తండ్రి చూసుకుంటున్నారని, తన తండ్రిని తాను పూర్తిగా విశ్వసించానని, తనకు దీనిపట్ల అవగాహన లేదని, అందుకే తన ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారని చెప్పారు. దీనిపై మండిపడ్డ సుప్రీంకోర్టు... నీ ఇమేజ్‌ తో వచ్చిన సంపాదనలో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసి ఉండాలని స్పష్టం చేసింది. మెస్సీకి శిక్ష పడడం పట్ల ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News