: కిమ్ జాంగ్ పై తిట్ల పురాణం.. బహిర్గతమైన ట్రంప్ ఫోన్ కాల్!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిట్ల పురాణాన్ని అందుకున్నారు. అణుబాంబులు పట్టుకున్న ఓ పిచ్చోడు కిమ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తీతో ఫోన్ లో సంభాషిస్తూ... ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ సంభాషణను అమెరికన్ వార్తాపత్రికలు బహిర్గతం చేయడంతో... ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాలకంటే తమ వద్ద 20 రెట్లు ఎక్కువ ఆయుధాలు ఉన్నాయని... కిమ్ ను క్షణాల్లో మట్టుబెట్టగల సత్తా తమకు ఉందని ట్రంప్ అన్నట్టు సదరు పత్రికలు తెలిపాయి. కిమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారని రోడ్రిగోను ట్రంప్ అడగ్గా... అతనికి మతి చెడింది, ఏ క్షణంలోనైనా అతను అత్యంత ప్రమాదకారిగా మారే ప్రమాదం ఉందని రోడ్రిగో సమాధానం ఇచ్చారు.

ఇదే సమయంలో రోడ్రిగోకు ట్రంప్ ఓ సూచన కూడా చేశారు. ఉత్తర కొరియాకు చైనా మద్దతు ఉపసంహరించుకుంటే కిమ్ పని అయిపోయినట్టే అని... 'ఒకసారి చైనా అధినేత జిన్ పింగ్ తో మీరు మాట్లాడి చూడండి' అని ట్రంప్ చెప్పారు. చైనా ఓకే అంటే పని సులువవుతుందని... లేకపోతే తామే కిమ్ మెడలు వంచుతామని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో చిట్టచివర ఉత్తర కొరియాపై అణుబాంబులు వేస్తామని... కానీ, అది ఎవరికీ మంచిది కాదని ట్రంప్ చెప్పారు. ఈ ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

More Telugu News