: పాకిస్థాన్ కు మరో షాక్ ఇచ్చిన ట్రంప్... గతంలో చేసిన సాయాన్ని 'అప్పు'గా మారుస్తూ ఆదేశాలు!

అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ సాగిపోతున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన సదస్సులో భారత్ ను ఉగ్రవాద బాధిత దేశంగా పేర్కొనడంపై లోపల్లోపల ఉడుక్కుంటున్న పాక్ కు మరోషాక్ ఇచ్చారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా టైమ్ లో ఉగ్రవాదంపై పోరాటానికి పాకిస్థాన్ కు భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. ఆ సహాయాన్ని ఇప్పుడు ట్రంప్ రుణంగా మార్చేయమని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన హయాంలోని మొట్టమొదటి బడ్జెట్‌ లో తగిన మార్పులు చేయాలంటూ యూస్ కాంగ్రెస్‌ కు ట్రంప్ సిఫారసు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో విదేశాలకు ఇచ్చే నిధులే అమెరికాకు గుదిబండగా మారాయని పేర్కొన్న ట్రంప్...ఇప్పుడు వాటిని రద్దు, లేదా అప్పుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

అందులో భాగంగా, పాకిస్తాన్‌ తోపాటు పలు దేశాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ‘లోన్’ (అప్పు) గా మార్చాలని సూచించారని వైట్‌ హౌస్‌ లో బడ్జెట్ మేనేజ్‌ మెంట్ డైరెక్టర్ మైక్ ముల్వానీ తెలిపారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఈ జాబితా నుంచి ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు మినహాయింపునిచ్చినట్టు తెలుస్తోంది. ఏఏ దేశాలకు చేసిన సాయాన్ని అప్పుగా పరిగణిస్తున్నామన్నది త్వరలోనే వెల్లడిస్తామని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటే...చైనా భారీగా చేస్తున్న ధనసాయం కూడా భవిష్యత్ లో అప్పుగా మారే ప్రమాదం ఉందని వివిధ దేశాలు భావించే అవకాశం ఉంది. అలా జరిగితే భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో లక్షల కోట్ల ఉచిత పెట్టుబడులు పేరుతో చైనా చేస్తున్న దౌత్య రాజకీయాలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.

More Telugu News