: అద్భుత ఆవిష్కరణ... ప్రపంచానికి తొలిసారిగా 'స్ట్రెచబుల్ డిస్ ప్లే'ను పరిచయం చేయనున్న శాంసంగ్

టెక్ దిగ్గజం శాంసంగ్, మరో అద్భుత ఆవిష్కరణను తెరపైకి తెచ్చింది. ఎస్ఐడీ - 2017 (సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే) పేరిట జరగనున్న యూఎస్ టెక్ ఫెయిర్ లో శాంసంగ్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా స్ట్రెచబుల్ డిస్ ప్లేను పరిచయం చేయనుంది. ఈ ఓఎల్ఈడీ డిస్ ప్లే వినూత్నమైనదని, ఇరువైపుల నుంచి దీన్ని వంచవచ్చని సంస్థ పేర్కొంది. ఫ్లెక్సిబుల్ సాంకేతికతలో ఈ డిస్ ప్లే ప్యానల్ సమూల మార్పులను తీసుకొస్తుందన్న నమ్మకం ఉందని తెలిపింది.

కాగా, గతంలో స్ట్రెచబుల్ డిస్ ప్లేలు వచ్చినా, వాటిని ఒకవైపు మాత్రమే వంచే వీలుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శాంసంగ్ తయారు చేసిన ఈ 12 ఎంఎం మందంతో కూడిన డిస్ ప్లే, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) విభాగాల్లో విరివిగా వాడుకోవచ్చని తెలిపారు. ఈ ఓఎల్ఈడీ 9.1 అంగుళాల వర్షన్ రూపంలో మొదటి సారి బయటకు రానుందని సమాచారం. కాగా, లాస్ ఏంజిల్స్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఎస్ఐడీ షో జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News