: ట్రంప్ కు భయంకరమైన వ్యాధి... మా దేశం పేరు వింటేనే వణికిపోతున్నారు: ఇరాన్ ఎద్దేవా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 'ఇరానోఫోబియా' అనే భయంకరమైన వ్యాధి పట్టుకుందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి బహ్రమ్ క్వాసేమి వ్యంగ్యారోపణ చేశారు. టెహ్రాన్ లో ఆయన మాట్లాడుతూ, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిలా వ్యవహరించడం లేదని... ఆయుధ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది గుర్రాన్ని చూసి భయపడతారని, ఇంకొందరు నీటిని చూసి కూడా భయపడతారని, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ పేరు వింటేనే వణికిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలను సౌదీ ఇస్లామిక్ తీవ్రవాదులకు అమ్మేస్తే, కుదుర్చుకున్న ఒప్పందానికి అర్థమేముంటుందని ఆయన ప్రశ్నించారు. సౌదీ అలాంటి పని చేయదని ట్రంప్ హమీ ఇవ్వగలరా? అని ఆయన నిలదీశారు. ఇప్పటికే సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్‌ లలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... వారికి అధునాతన ఆయుధాలు అందితే తూర్పు మధ్య దేశాల్లో వారు సృష్టించే అరాచకంతో అస్థిరత ఏర్పడుతుందని హెచ్చరించారు. సౌదీతో అమెరికా చేసుకుంటున్న ఆయుధ ఒప్పందాలను దుబాయ్ కూడా తప్పుపట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

More Telugu News