: ‘ఫేస్ బుక్’ కు భారీ జరిమానా విధించిన యూరోపియన్ కమిషన్!

‘వాట్సాప్’ టేకోవర్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కు యూరోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది.12 కోట్ల డాలర్లు జరిమానా విధించింది. మన కరెన్సీలో దీని విలువ సుమారు రూ.773 కోట్లు. ఈ సందర్భంగా ఈయూ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్ విలీన నిబంధనలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలని, సరైన సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందన్నారు.

కాగా, భారీ జరిమానా విధించిన విషయమై ‘ఫేస్ బుక్’ స్పందిస్తూ, యూరోపియన్ కమిషన్ కు తాము పూర్తిగా సహకరించామని, జరిగిన పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, 2014లో ‘వాట్సప్’ ను ‘ఫేస్ బుక్’ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈయూ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ‘ఫేస్ బుక్’, ‘వాట్సాప్’ లను వేర్వేరుగా ఉంచుతామని నాడు ‘ఫేస్ బుక్’ యాజమాన్యం పేర్కొంది. అయితే, 2016లో ఈ రెండింటిలోని యూజర్ల సమాచారాన్ని కలిపే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన యూరోపియన్ కమిషన్, ‘ఫేస్ బుక్’ కు భారీ జరిమానా విధించడం జరిగింది.


 

More Telugu News