: 'వాన్నా క్రై'ని మించిన వైరస్ వచ్చేసింది... గుర్తించిన చైనా

ప్రపంచంలోని 150కి పైగా దేశాల కంప్యూటర్లను పట్టి పీడిస్తున్న ర్యాన్సమ్ వేర్ వైరస్ 'వాన్నా క్రై' నుంచి బయటపడేందుకు స్పష్టమైన మార్గాలను సైబర్ నిపుణులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్న వేళ, దానికి మించిన వైరస్ ప్రపంచాన్ని కబళించేందుకు సిద్ధంగా ఉందని చైనా ప్రకటించింది. ర్యాన్సమ్ వేర్ ను మించిన వైరస్ ను తాము కనుగొన్నామని నేడు ప్రకటించింది. చైనాలోని జాతీయ కంప్యూటర్ వైరస్ అత్యవసర స్పందన కేంద్రం (సీబీఈఆర్సీ) ఓ ప్రకటన వెలువరుస్తూ, కంప్యూటర్లతో పాటు స్మార్ట్ ఫోన్లనూ పట్టుకునే వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించింది. ఈ వైరస్ సోకితే కంప్యూటర్లు పూర్తిగా స్తంభించి పోతాయని హెచ్చరించింది.

 'వాన్నా క్రై'తో పోలిస్తే ఇది బలమైనదని, అయితే, ఈ వైరస్ కూడా వాన్నా క్రై వచ్చిన అదే ఎస్ఎంబీ 'సర్వర్ మెసేజ్ బ్లాక్' నుంచి వస్తుందని నిపుణులు వెల్లడించారు. దీనికి షాడో బ్రోకర్లు ఎంఎస్17-010 అని పేరు పెట్టారు. ఇది సిస్టమ్స్ ను పట్టుకుని పీడించడంతో పాటు, దానితో అనుసంధానమైన నెట్ వర్క్ కంప్యూటర్లకు విస్తరిస్తుందని, తనంతట తానుగానే బాధితులను వెతుక్కుంటుందని తెలిపారు. ఏ విధమైన ఫైల్ రూపంలో లేకుండానే ఇది సోకుతుందని, కంప్యూటర్ డిస్క్ లలోకి చొరబడి పాతుకుపోతుందని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ వైరస్ కోడ్ స్ట్రింగ్స్ ప్రకారం, ఇది సోకితే బ్రౌజర్ లాగిన్స్ అన్నీ స్తంభించిపోతాయని, ఎఫ్టీపీ (ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రొటోకాల్), ఈమెయిల్, మెసింజర్ వంటి వాటితో పాటు డేటాపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.

ఇప్పటికీ ర్యాన్సమ్ వేర్ 'వాన్నా క్రై' వేలాది కంప్యూటర్లలోని డేటాను తన చేతిలో పెట్టుకుని ఉన్న సంగతి తెలిసిందే. వాటిని తిరిగి యథాతథ స్థితికి తీసుకురావాలంటే, 300 డాలర్లు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ర్యాన్సమ్ వేర్ ను చొప్పించిన హ్యాకర్లు ఇంతవరకూ 50 వేల డాలర్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అంతకు మించి ప్రభావాన్ని చూపే కొత్త వైరస్ బయటకు వస్తే, అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్స్ తో ఉన్న కంప్యూటర్లు సైతం ప్రమాదంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News