: బుకీని కలిసిన విషయం చెప్పలేదని పాక్ క్రికెటర్ పై రెండు నెలల నిషేధం

పాకిస్తాన్‌ కు చెందిన ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్ (23) పై ఆ దేశ క్రికెట్ బోర్డు రెండు నెలల నిషేధం విధించడం కలకలం రేపింది. పాక్ జట్టులో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న నవాజ్ ఈ మధ్య ఆస్ట్రేలియా పర్యటించిన పాక్ జట్టులో సభ్యుడు. దీంతో ఆసీస్ లో స్పాట్ ఫిక్సింగ్ కోసం బుకీలు నవాజ్ ను సంప్రదించారు. పిచ్, ఆటగాళ్లు, వ్యూహాలకు సంబంధించిన సమాచారం అందిస్తే భారీ మొత్తంలో ముట్టజెబుతామంటూ ప్రతిపాదన చేశారు. అయితే దానికి నవాజ్ అంగీకరించలేదు. కానీ, తాను బుకీలను కలిసిన విషయం, వారు తనకు ఇచ్చిన ఆఫర్ సంగతిని గురించి బోర్డుకు ఆలస్యంగా తెలియజేశాడు.

దీనిని జాతీయ అవినీతి నిరోధక విభాగం ముందు అతడు ఒప్పుకున్న నేపథ్యంలో బోర్డు రెండు నెలల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. సస్పెన్షన్‌ కాలంలో అతడు బోర్డుతో కుదుర్చుకున్న సెంట్రల్‌ కాంట్రాక్టు వర్తించదని స్పష్టం చేసింది. అన్ని ఫార్మాట్లకు ఈ నిషేధం వర్తిస్తుందని పీసీబీ ప్రకటించింది. కాగా, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఆ దేశ క్రికెటర్లు నాసిర్‌ జంషేడ్‌, షర్జీల్‌ ఖాన్‌, ఖలీద్‌ లతీఫ్‌ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

More Telugu News