: మరో వివాదంలో డొనాల్డ్ ట్రంప్.... అమెరికాలో కలకలం రేపుతున్న వాషింగ్టన్ పోస్ట్ కథనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో పడ్డారు. అమెరికాలోని ప్రధాన పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన వ్యాసం ఆ దేశంలో పెను కలకలం రేపుతోంది. ఈ నెల 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో సమావేశమయ్యారు. వైట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ తో పాటు అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌, మరో ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐసిస్‌ నుంచి ఎదురవుతున్న సవాళ్లతో పాటు వివిధ సమస్యలపై చర్చించారు. పాశ్చాత్యదేశాల్లో దాడులకు ఐసిస్‌ పన్నిన కుట్రల గురించి మాట్లాడుతూ, మిత్రదేశాలకు చెందిన నిఘా వ్యవస్థల ద్వారా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రతిరోజూ తనకందుతుందని ట్రంప్ రష్యా ప్రతినిధులకు తెలిపారు.

అంతే కాకుండా తాను ల్యాప్ ట్యాప్, మొబైళ్లను విమానాల్లో నిషేధించడం వెనుక కారణం... ల్యాప్‌ ట్యాప్‌ ల ద్వారా విమానాల పేల్చివేతకు ఐసిస్‌ సిరియాలోని ఒక పట్టణంలో వ్యూహరచన చేసిందని చెప్పారు. ఈ వివరాలతో పాటు, మరింత రహస్యమైన సమాచారాన్ని ఆయన వారితో పంచుకున్నారు. అయితే ఆ వివరాలను అమెరికా ప్రయోజనాల దృష్ట్యా వెల్లడించడం లేదని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో వెల్లడించింది. వెంటనే రంగంలోకి దిగిన వైట్‌ హౌస్‌ వాషింగ్టన్ పోస్ట్ కథనం ఊహాజనితమంటూ ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ విశ్వసనీయతపై అనుమానాలు మాత్రం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆందోళనలు మొదలయ్యాయి.

 ట్రంప్‌ వెల్లడించిన సమాచారం ఒక మిత్రదేశం అమెరికాతో పంచుకున్న అత్యంత రహస్య నిఘా సమాచారమని, ఇది కేవలం అమెరికా అధికార వ్యవస్థలో పైస్థాయిలో అతికొద్ది మంది ఉన్నతాధికారులకు మాత్రమే తెలియాల్సిందని... అలాంటి దానిని ట్రంప్ శత్రుదేశమైన రష్యాతో ఎలా పంచుకుంటారంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. మిత్రదేశాలకు కూడా వెల్లడించని సమాచారాన్ని రష్యాకు వెల్లడించడంతో ట్రంప్ రష్యా ఏజెంట్ అన్న విషయం నిర్ధారణ అవుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఐసిస్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్న మిత్రదేశాలు ఇకపై అందించే అవకాశం ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా తమకు సంబంధించిన సమాచారాన్ని బయటకు వెల్లడిస్తున్న గూఢచారుల గురించి ఐసిస్ వేట మొదలు పెడితే... మొదటికే మోసం వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హిల్లరీ క్లింటన్ మెయిల్స్ లీక్ చేయడంలో రష్యా అధికారులు కీలకంగా వ్యవహరించారని, రష్యా అండతోనే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది నిర్ధారణ అయిందని వారు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News