: అనుమానంతో రష్యా, చైనాలకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్

దక్షిణ కొరియా, జపాన్ సముద్ర తీరాల్లో అమెరికా సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమైంది. దీంతో రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఉత్తరకొరియా పీచమణుస్తామని అమెరికా ప్రగల్భాలు పలికితే... దమ్ముంటే ప్రయత్నించు, అమెరికన్లకు నిలువనీడలేకుండా చేస్తానంటూ ఉత్తరకొరియా సవాలు విసిరింది. ఈ క్రమంలో యుద్ధానికి అంతా సిద్ధమైందని ప్రపంచం భావించింది. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేయడంతో ఒక్కసారిగా అమెరికా ఆలోచనలు, అంచనాలు, వ్యూహాలు మారాయి. ఉత్తరకొరియా ఇంత ధైర్యం చేయడం వెనుక కారణం, రష్యా, చైనాలని గ్రహించింది. దీంతో తాము ఏమాత్రం తొందరపడ్డా అమెరికా తీవ్రంగా నష్టపోతుందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా నిఘా వర్గాల సమాచారం ప్రకారం... ఉత్తరకొరియాపై దాడికి దిగిన మరుక్షణం అమెరికా ఉపగ్రహ వ్యవస్థను రష్యా, చైనాలు టార్గెట్ చేశాయని గుర్తించారు. దీంతో ఒకవేళ యుద్ధం అనివార్యమయితే మాత్రం ఆ రెండు దేశాలు తమ శాటిలైట్ వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూనే... తామేమి చూస్తూ కూర్చోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. రష్యా, చైనాలను ఎదుర్కొని, గట్టి సమాధానం ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసుకున్నామని అమెరికా ఇంటలిజెన్స్ డైరెక్టర్ డేనియల్ కోట్స్ వెల్లడించారు. రష్యా, చైనాలు రెండు కలిసి వచ్చినా తమ ఉపగ్రహ వ్యవస్థను ఏమీ చేయలేవని తెలిపారు. భూమి మీదనుంచైనా, లేదా ఆకాశం నుంచైనా ప్రయోగించగలిగే అత్యాధునిక ఆయుధాలు తమ దగ్గరున్నాయని ఆయన చెప్పారు.

వాటిని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఉపయోగించబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే తమకు ముప్పు ఉందంటే మాత్రం తమ ఏర్పాట్లు తమకు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఆయుధాలు ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటాయని చెప్పిన ఆయన, వాటి వినియోగం ఎంత తక్కువ అయితే అంత మంచిదని అన్నారు. ఆ రెండు దేశాలు కలిసి తమ ఉపగ్రహ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తే, వాటిపై దాడి చేసేందుకు నిమిషం కూడా ఆలోచించమని ఆయన హెచ్చరించారు. అమెరికాకు సరితూగే ఉపగ్రహ వ్యవస్థను ఆ రెండు దేశాలు అందిపుచ్చుకునేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన స్పష్టం  చేశారు. రష్యా, చైనాల యుద్ధతంత్రాలను తాము అంచనా వేయగలమని ఆయన ప్రకటించారు. 

More Telugu News