: నడిరోడ్డుపై పిడుగు.. ఆపై మలమలా మాడిపోయిన చెట్లు.. భయంతో వణికిపోయిన వాహనదారులు!

కళ్ల ముందే పడిన పిడుగు రోడ్డు పక్కన ఉన్న చెట్లను మలమలా మాడ్చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన వాహనదారులు హతాశులయ్యారు. ఆ ప్రమాదం నుంచి తాము బయటపడడం ఆనందంగా ఉన్నా ఆ వణుకు మాత్రం వారికి ఇప్పటికీ తగ్గడం లేదు. ఈనెల 11న చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొదట ఈదురు గాలులు వేయగా ఆ తర్వాత కాసేపటికే వర్షం పడింది. పెద్దపెద్ద శబ్దాలతో ఉరుములు భయపెట్టాయి. దీంతో రోడ్డపై వెళ్తున్న వాహనదారులు వేగం తగ్గించి వైపర్లు వేసుకుంటూ నిదానంగా వెళ్తున్నారు.

అదే సమయంలో షెన్యాంగ్‌లోని రద్దీగా ఉండే కాలనీలో నడిరోడ్డుపై పెద్ద శబ్దం చేసుకుంటూ పిడుగు పడింది. అంతే.. వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తమ ఎదురుగానే పిడుగు పడడంతో భయంతో కంపించిపోయారు. రోడ్డుపై పడిన పిడుగు పక్కనే ఉన్న చెట్లను దహించి వేసింది. చెట్లు క్షణాల్లోనే మాడిమసైపోయాయి. పిడుగుపాటుకు అంటుకున్న చెట్లు నిట్ట నిలువునా నిప్పులు చిమ్ముతూ కాలిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఓ కారులో ఉన్న కెమెరా ఈ లైవ్ పిడుగును రికార్డ్ చేసింది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

More Telugu News